తెరపైకి 'ట్రోఫీ' వివాదం

‘Trophy’ Controversy: దుబాయ్ వేదికగా నిన్న జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత జట్టుపై పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే మైదానంలో ఆట కంటే కూడా, బహుమతి ప్రదానోత్సవ సమయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన సీనియర్ పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించినప్పుడు, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమ్ ఇండియా నిరాకరించింది. ఆ వివాదం ఇంకా సమసిపోకముందే, తాజాగా అండర్-19 ఫైనల్‌లో నఖ్వీ స్వయంగా స్టేజీపై ఉండి పాక్ ఆటగాళ్లకు ట్రోఫీని అందజేయడమే కాకుండా, వారితో కలిసి సంబరాల్లో మునిగిపోయారు. రన్నరప్ అయిన భారత ఆటగాళ్లు కనీసం స్టేజీపైకి కూడా వెళ్లకుండా, కిందే ఐసీసీ డైరెక్టర్ ముబష్శిర్ ఉస్మానీ నుంచి మెడల్స్ అందుకుని నిరసన వ్యక్తం చేశారు. మ్యాచ్ విషయానికి వస్తే, వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఈ ఫైనల్‌లో పాకిస్థాన్ అన్ని విభాగాల్లోనూ భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్, ఓపెనర్ సమీర్ మిన్హాస్ విధ్వంసకర ఇన్నింగ్స్ (113 బంతుల్లో 172 పరుగులు) ధాటికి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 26.2 ఓవర్లలో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. పాక్ పేసర్లు అలీ రజా, మహ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్ భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (26) మెరుపు ఆరంభం ఇచ్చినప్పటికీ, అది ఎక్కువ సేపు నిలవలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story