Under-19 Asia Cup Defeat: అండర్-19 ఆసియా కప్ ఓటమి: కెప్టెన్, కోచ్‌ను వివరణ కోరనున్న బీసీసీఐ!
కెప్టెన్, కోచ్‌ను వివరణ కోరనున్న బీసీసీఐ!

Under-19 Asia Cup Defeat: యూఏఈ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సీరియస్ అయింది. ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలవ్వడంపై టీమ్ ఇండియా అండర్-19 కెప్టెన్ ఆయుష్ మాత్రే, హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్ నుంచి బోర్డు 'వివరణ' కోరనున్నట్లు సమాచారం. సోమవారం (డిసెంబర్ 22) జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఘోర పరాజయంపై సమీక్ష ట్రోఫీ చేజారడంపై బీసీసీఐ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ ప్రదర్శనపై 'సమీక్ష' అవసరమని భావించారు. ఈ టోర్నీ గ్రూప్ దశలో అద్భుతంగా రాణించిన భారత్, ఫైనల్ చేరే వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. చివరకు లీగ్ దశలో తాము ఓడించిన పాకిస్థాన్ చేతిలోనే ఫైనల్‌లో 192 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలవ్వడం గమనార్హం. సాధారణంగా టీనేజ్ ఆటగాళ్ల ప్రదర్శనపై బోర్డు ఇంత కఠినంగా వ్యవహరించడం అరుదు, కానీ ఫైనల్ ఓటమి తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
పాక్ బ్యాటర్ల విశ్వరూపం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ కేవలం 113 బంతుల్లోనే 172 పరుగులతో వీరవిహారం చేశాడు. అతనికి తోడుగా అహ్మద్ హుస్సేన్ (56) రాణించడంతో పాక్ పటిష్ట స్థితికి చేరుకుంది. భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
కుప్పకూలిన టీమ్ ఇండియా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో ధాటిగానే ఆడింది. వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ తొలి 4 ఓవర్లలోనే స్కోరును 49కి చేర్చారు. అయితే నాలుగో ఓవర్ చివరి బంతికి జార్జ్, ఐదో ఓవర్ తొలి బంతికే సూర్యవంశీ అవుట్ కావడంతో భారత్ పతనం మొదలైంది. పాక్ పేసర్ల ధాటికి భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. చివరకు భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలి ఓటమిని మూటగట్టుకుంది.
వరల్డ్ కప్‌పై దృష్టి 2026 జనవరి-ఫిబ్రవరిలో జరగనున్న అండర్-19 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, జట్టులోని లోపాలను త్వరగా సరిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది. మెగా టోర్నీకి ముందు ఆటగాళ్లలో ఉన్న లోపాలను, కోచింగ్ విధానాలను సరిచూసుకోవడమే లక్ష్యంగా ఈ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

