Under-19 World Cup 2026: అండర్ 19 వరల్డ్ కప్: ఫైనల్లోకి యంగ్ ఇండియా
ఫైనల్లోకి యంగ్ ఇండియా

Under-19 World Cup 2026: అండర్ 19 వరల్డ్ కప్‌లో ఇండియా కుర్రాళ్లు మరోసారి కుమ్మేశారు. హైదరాబాద్ క్రికెటర్ ఆరోన్ జార్జ్ (104 బాల్స్‌లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 115) అద్భుత సెంచరీతో ముందుండి నడిపించడంతో అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ చేసి రికార్డు సృష్టించిన యంగ్ ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసింది. దాంతో టోర్నీలో పదోసారి ఫైనల్ చేరుకున్న కుర్రాళ్ల టీమ్ ఆరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 310/4 స్కోరు చేసింది. ఫైసల్ షినోజదా (110), ఉజైరుల్లా నియాజై (101 నాటౌట్) సెంచరీతో సత్తా చాటారు. ఇండియా బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇండియా 41.1 ఓవర్లలోనే 311/3 రన్స్ చేసి ఈజీగా గెలిచింది. స్టార్టింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (33 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68)తో తొలి వికెట్‌కు 90 రన్స్ జోడించిన ఆరోన్ గట్టి పునాది వేశాడు. ఫిఫ్టీ తర్వాత వైభవ్ ఔటవగా కెప్టెన్ ఆయుష్ మాత్రే (62).. ఆరోన్‌తో రెండు వికెట్‌కు 114 రన్స్ పార్ట్‌నర్‌షిప్ చేశాడు. టోర్నీలో బ్యాట్‌తో రాణించలేకపోతున్న మాత్రే కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత విహాన్ మల్హోత్రా (38నాటౌట్) తోడుగా టార్గెట్ కరిగించిన ఆరోన్ సెంచరీ పూర్తి చేసుకొని అండర్19 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన రెండో ఇండియన్‌గా ఉన్ముక్త్ చంద్ (2012 ఫైనల్లో ఆస్ట్రేలియాపై 111*) రికార్డును బ్రేక్ చేశాడు. ఆరోన్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.

