Vaibhav Suryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనం
సంచలనం

Vaibhav Suryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి సంచలనం సృష్టించగా.. వన్డేల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. జింబాబ్వేపై చెలరేగిపోయిన 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును సొంతం చేసుకున్నాడు. మూడు టీ20ల్లో కలిపి 151 పరుగులు చేసిన అతడు.. తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకడం విశేషం. అనతికాలంలోనే టాప్-50లో అడుగుపెట్టిన వైభవ్.. ప్రస్తుతం 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానంలో కొనసాగుతున్నాడు.
టీ20ల్లో ఇషాన్ కిషన్ హవా
టీ20 బ్యాటింగ్ విభాగంలో భారత ఆటగాడు ఇషాన్ కిషన్ 910 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ ఆటగాడు సహిబ్జాద ఫర్హాన్ (848) రెండో స్థానానికి చేరాడు. ఇంగ్లాండ్‌పై పర్వాలేదనిపించిన అభిషేక్ శర్మ.. జింబాబ్వేపై తేలిపోవడంతో ఒక స్థానం కోల్పోయి 819 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. మరోవైపు తిలక్ వర్మ (750) రెండు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకును దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో టాప్-10లో భారత్ నుంచి వరుణ్ చక్రవర్తి (663) ఒక్కడే 9వ స్థానంలో ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా ఐదు స్థానాలు కోల్పోయి 17వ ర్యాంకుకు పరిమితమయ్యాడు.
వన్డేల్లో టాప్‌లో శుభ్‌మన్ గిల్
వన్డే ర్యాంకింగ్స్‌లో భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 801 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ (794) రెండో స్థానానికి పడిపోయారు. ఇక టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (767), రోహిత్ శర్మ (758) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. వన్డే బౌలింగ్ విభాగంలో టాప్-10లో భారత్ నుంచి ఎవరూ లేకపోగా.. కుల్దీప్ యాదవ్ (596) 11వ స్థానంలో ఉన్నాడు.
జట్ల హోదా
జట్లవారీగా చూస్తే.. వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టెస్టుల్లో మాత్రం నాలుగో ర్యాంకులో నిలిచింది. అయితే టీ20ల్లో ఇంగ్లాండ్ (268 పాయింట్లు), భారత్ (268 పాయింట్లు) మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

