Vaibhav Suryavanshi: సచిన్ రికార్డుకు ఎసరు.. టీమ్ ఇండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్!
టీమ్ ఇండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్!

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది.. ఆ పేరే వైభవ్ సూర్యవంశీ. తన మెరుపు బ్యాటింగ్‌తో దిగ్గజ బౌలర్లనే వణికించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, ఇప్పుడు టీమ్ ఇండియా నీలి రంగు జెర్సీని ధరించేందుకు సిద్ధమయ్యాడు. వైభవ్ ప్రతిభకు ముగ్ధులైన బీసీసీఐ సెలెక్టర్లు, అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే జూన్ నెలలో భారత్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని నిర్ణయించింది. ఈ జట్టులో వైభవ్ పేరును షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. అదే జరిగితే అతి చిన్న వయస్సులో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా వైభవ్ ప్రతిభను కొనియాడుతూ, అతను ఈ అరుదైన రికార్డుకు అర్హుడని సోషల్ మీడియాలో పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వైభవ్ జట్టులోకి వస్తే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న దశాబ్దాల కాలపు రికార్డు బద్దలవుతుంది. సచిన్ 16 ఏళ్ల 205 రోజుల వయస్సులో అరంగేట్రం చేయగా.. వైభవ్ వయస్సు ప్రస్తుతం కేవలం 15 ఏళ్లు మాత్రమే. అలాగే మహిళల క్రికెట్‌లో షఫాలీ వర్మ పేరిట ఉన్న అతి చిన్న వయస్సు రికార్డు కూడా ఈ కుర్రాడి దెబ్బకు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని ఎదుర్కొనే సత్తా అతడికి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సీజన్ వైభవ్ కెరీర్‌నే మార్చేసింది. బెంగళూరుపై కేవలం 26 బంతుల్లో 78 పరుగులు, చెన్నైపై 17 బంతుల్లో హాఫ్ సెంచరీ, ముంబైపై 14 బంతుల్లో 39 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జస్ప్రీత్ బుమ్రా వంటి మేటి బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొంటున్న తీరు చూసి ఇర్ఫాన్ పఠాన్, అనిల్ కుంబ్లే వంటి మాజీలు ఫిదా అయిపోయారు. అతను కేవలం టీనేజర్ కాదని, అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్న ఒక యుద్ధనౌక అని వారు అభిప్రాయపడుతున్నారు.మరికొద్ది రోజుల్లోనే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ప్రకటన వెలువడనుంది. అదే జరిగితే, భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.

