42 బంతుల్లో 144 రన్స్‌తో సునామీ ఇన్నింగ్స్

Vaibhav Suryavanshi: ఆసియా రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో ఇండియా-ఎ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బౌలర్లపై మెరుపు దాడి చేసి విధ్వంసం సృష్టించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఎకు ఈ యువ సంచలనం భారీ ఆరంభాన్ని ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 15 భారీ సిక్స్‌లు ఉన్నాయి. ఈ 14 ఏళ్ల కుర్రాడు కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుని తన దూకుడును కొనసాగించాడు.

బౌలర్లపై దండయాత్ర

వైభవ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. ఆయాన్ ఖాన్, జవదుల్లా, రోహిద్ ఖాన్ బౌలింగ్‌లలో పరుగుల సునామీ సృష్టించాడు. సెంచరీ తర్వాత అతని జోరు మరింత పెరిగింది. హర్షిత్ కౌశిక్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో చెలరేగి, యూఏఈ బౌలింగ్ దళాన్ని కకావికలం చేశాడు. చివరికి, 12.3 ఓవర్లలో ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో ఔటయ్యే సమయానికి ఇండియా-ఎ జట్టు భారీ స్కోరు దిశగా పయనించేందుకు బలమైన పునాదిని వేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ టోర్నమెంట్‌లో తన స్టార్ హోదాను చాటుకున్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story