Venus Williams: 46 ఏళ్ల వయసులో వీనస్ విలియమ్స్ సరికొత్త రికార్డు
వీనస్ విలియమ్స్ సరికొత్త రికార్డు

Venus Williams: టెన్నిస్ చరిత్రలో అత్యంత అద్భుతమైన పునరాగమనాల్లో ఒకటిగా నిలిచేలా, అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ మళ్లీ రాకెట్ పట్టనున్నారు. జనవరి 18 నుండి మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2026 కోసం ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ అయిన వీనస్‌కు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఆమె అత్యంత పెద్ద వయసులో (45 ఏళ్ల 7 నెలలు) ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో ఆడిన మహిళగా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.
వీనస్ విలియమ్స్ తన వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆమె డెన్మార్క్‌కు చెందిన మోడల్, నటుడు ఆండ్రియా ప్రెటిని వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఆమె మెల్‌బోర్న్ పార్క్‌లో అడుగుపెడుతుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. "మళ్లీ ఆస్ట్రేలియాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేసవిలో పోటీ పడటానికి ఎదురుచూస్తున్నాను" అని వీనస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అత్యంత పెద్ద వయసు క్రీడాకారిణి: ఇప్పటివరకు జపాన్‌కు చెందిన కిమికో డేట్ (44 ఏళ్లు) పేరిట ఉన్న రికార్డును వీనస్ అధిగమించనున్నారు.1998లో మొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన వీనస్, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కూడా అదే ఉత్సాహంతో పోటీ పడుతుండటం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నద్ధతగా ఆమె ఆక్లాండ్, హోబార్ట్ టోర్నీలలో కూడా వైల్డ్‌కార్డ్‌తో బరిలోకి దిగనున్నారు.
మెల్‌బోర్న్ పార్క్‌లో వీనస్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఆమె ఇక్కడ రెండుసార్లు (2003, 2017) ఫైనల్‌కు చేరుకున్నారు. విశేషమేమిటంటే ఆ రెండు సార్లు తన చెల్లెలు సెరెనా విలియమ్స్ చేతిలోనే ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆమె 54 విజయాలు సాధించగా, ఇది ఆమెకు 22వ మెయిన్ డ్రా ప్రదర్శన కానుంది.

