Coach Gambhir: పాక్‌పై విజయం.. పహల్గాం బాధితులకు అంకితం - కోచ్ గంభీర్
పహల్గాం బాధితులకు అంకితం - కోచ్ గంభీర్

Coach Gambhir: ఆదివారం ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన ఏడు వికెట్ల విజయం పట్ల టీమ్‌ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్, ఆటగాళ్ల ప్రదర్శన పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. "ఇది మాకు ఒక గొప్ప విజయం. అయితే అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక జట్టుగా మేము పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకున్నాం. ఆపరేషన్ సింధూర్‌ను విజయవంతం చేసిన మన సైనికులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశం గర్వపడేలా, సంతోషంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం" అని గంభీర్ అన్నారు.
పాకిస్థాన్‌ను 127 పరుగులకే కట్టడి చేయడంపై గంభీర్ బౌలర్లను ప్రత్యేకంగా అభినందించారు. "ముగ్గురు స్పిన్నర్లు, ముఖ్యంగా బుమ్రా అద్భుతంగా రాణించారు. ఇంతకంటే మంచి ప్రదర్శనను మేం కోరుకోలేం" అని ఆయన పేర్కొన్నారు. కోచ్‌గా తన ప్రయాణం గురించి అడిగినప్పుడు, "కొన్ని మంచి రోజులు, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. కోచింగ్ అంటే ఇదే. నిజాయితీగా పని చేయడం ముఖ్యం" అని గంభీర్ బదులిచ్చారు. ఈ విజయం జట్టు ఐక్యతను, దేశం పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తుందని గంభీర్ వ్యాఖ్యానించారు.
