Vijay Hazare Trophy: వరుసగా నాల్గో సారి సెమీస్ కు కర్ణాటక
సెమీస్ కు కర్ణాటక

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ మొదటి క్వార్టర్ ఫైనల్‌లో కర్ణాటక జట్టు బలమైన ముంబైపై ఘనవిజయం సాధించి, వరుసగా నాలుగోసారి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం కలగడంతో, VJD పద్ధతి (V. Jayadevan method) ప్రకారం కర్ణాటకను 55 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. శామ్స్ ములానీ (86) టాప్ స్కోరర్. సిద్ధేశ్ లాడ్ (38), సాయిరాజ్ పాటిల్ (33 నాటౌట్), అంగ్‌క్రిష్ రఘువంశీ (27), ఇషాన్ మూల్‌చందానీ (20) రాణించారు.
లక్ష్య ఛేదనలో కర్ణాటక 33 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టానికి 187 పరుగులు చేసిన సమయంలో వర్షం పడింది. అప్పటికే కర్ణాటక విజయానికి అవసరమైన రన్ రేట్ కంటే చాలా ముందుండటంతో విజయం దక్కింది.ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న పడిక్కల్, ఈ మ్యాచ్‌లో కూడా 81 పరుగులు (అజేయంగా) చేసి జట్టును గెలిపించాడు. ఇతను ఒకే విజయ్ హజారే సీజన్‌లో రెండుసార్లు 700 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అనుభవజ్ఞుడైన కరుణ్ నాయర్ 74 పరుగులు (అజేయంగా) చేసి పడిక్కల్‌కు తోడుగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ (3 వికెట్లు) ముంబై టాపార్డర్‌ను దెబ్బతీయగా, విధ్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి చెరో రెండు వికెట్లు తీశారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కర్ణాటక, సెమీఫైనల్‌లో ఢిల్లీ లేదా విదర్భ విజేతతో తలపడనుంది.

