విజయ్ మాల్యా సంచలన పోస్ట్!

Vijay Mallya: ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు యజమానిగా ఉన్న విజయ్ మాల్యా, తాజాగా ఆ ఫ్రాంచైజీ రికార్డు ధర we విక్రయించబడటంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుమారు 2 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 18,776 కోట్లు) ఈ జట్టు అమ్ముడుపోవడంతో, గతంలో తన పెట్టుబడిని విమర్శించిన వారికి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. 2008లో తాను రూ. 450 కోట్లకు ఈ జట్టును కొనుగోలు చేసినప్పుడు, చాలామంది తనను చూసి నవ్వారని, అది కేవలం ఒక 'విలాసవంతమైన పిచ్చి' (వానిటీ ప్రాజెక్ట్) అని ఎగతాళి చేశారని మాల్యా గుర్తు చేసుకున్నారు. కానీ నేడు అదే పెట్టుబడి వేల కోట్లకు పెరగడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.

యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ఈ జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్ మరియు బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజ సంస్థల కన్సార్టియానికి విక్రయించింది. ఈ డీల్‌లో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కోసం కేటాయించిన రూ. 540 కోట్లు మరియు BCCI కి చెల్లించే 5 శాతం కమిషన్ కూడా కలిసి ఉన్నాయి. ఈ భారీ విక్రయాన్ని ప్రస్తావిస్తూ.. "నాడు రూ. 450 కోట్లు పెడితే అందరూ నన్ను విమర్శించారు. కానీ నా ఆశయం 'రాయల్ ఛాలెంజ్' బ్రాండ్‌ను నిర్మించడం. అందుకే ఈ జట్టుకు RCB అని పేరు పెట్టాను. ఇప్పుడు ఆ పెట్టుబడి రూ. 16,660 కోట్లకు చేరడం చూస్తుంటే నా నిర్ణయం సరైనదని నిరూపితమైంది" అని మాల్యా పేర్కొన్నారు.

అంతేకాకుండా, విరాట్ కోహ్లీ వంటి యువ ఆటగాడిని తాను ఎంపిక చేసిన రోజులను మాల్యా గుర్తుచేసుకున్నారు. కోహ్లీ నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదగడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని, RCB ఎప్పటికీ తన డిఎన్ఏ (DNA) లో భాగమని ఎమోషనల్ అయ్యారు. తన హయాంలో జట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, 'బెంగళూరు సింహం' అయిన ఆర్సీబీకి ఎప్పుడూ మద్దతు ఇవ్వాలని కోరుతూ 'నమస్కారం'తో తన పోస్ట్‌ను ముగించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిల కేసులో ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మాల్యా, ఒకవైపు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, తన వ్యాపార దృక్పథంపై వచ్చిన విమర్శలకు ఇలా సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story