Vinod Kambli: వినోద్ కాంబ్లీ ఐస్ క్రీం యాడ్.. మార్కెటింగ్ కోసం ఇంత దిగజారాలా?
మార్కెటింగ్ కోసం ఇంత దిగజారాలా?

Vinod Kambli: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. అయితే ఈసారి ఆయన వార్తల్లోకి వచ్చింది ఆట వల్ల కాదు, ఒక ఐస్‌క్రీమ్ బ్రాండ్ ప్రకటన వల్ల. గత ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, మృత్యువుతో పోరాడి గెలిచిన కాంబ్లీ.. చాలా కాలం తర్వాత తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఆయన్ని ఇలా ఆరోగ్యంగా చూడటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నా, ఈ ప్రకటన వెనుకున్న కాన్సెప్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ఒక ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ రూపొందించిన ఈ యాడ్‌లో.. కాంబ్లీ తన పాత క్రికెట్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కనిపిస్తారు. "జీవితంలో కొంచెం తక్కువ పొందినవారు.. కొంచెం ఎక్కువ పొందడానికి అర్హులు" అనే థీమ్‌తో ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ను చిత్రీకరించారు. కాంబ్లీ పతనమైన తీరు, అనారోగ్యం నుంచి కోలుకుని చేసిన కమ్‌బ్యాక్‌ను తన బ్రాండ్ ప్రమోషన్‌కు లింక్ చేసింది సదరు సంస్థ. కాంబ్లీ దృఢ సంకల్పాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే మా ఉద్దేశమని ఆ సంస్థ చెబుతోంది.
అయితే ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోని విషాదాన్ని, కష్టాలను మార్కెటింగ్ కోసం వాడుకోవడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆయన అనారోగ్యాన్ని, పర్సనల్ లైఫ్‌ను వ్యాపారానికి వాడుకుంటారా?" అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కాంబ్లీకి ఈ యాడ్ ద్వారా కొంత ఉపాధి దొరికిందని, దీన్ని పాజిటివ్‌గా చూడాలని వాదిస్తున్నారు.

