ఆటగాళ్లకు గాయాలు

Violent Clash During Football Match: పాకిస్తాన్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ ఫుట్‌బాల్ సెమీ-ఫైనల్ మ్యాచ్ అనంతరం తీవ్ర హింసాత్మక ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటగాళ్లతో పాటు అధికారులు కూడా గాయపడ్డారు. ఈ సంఘటనపై పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (PFF), పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ (POA) దర్యాప్తుకు ఆదేశించాయి.

ఈ సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ ఆర్మీ , WAPDA జట్ల మధ్య కరాచీలోని కేపీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్మీ జట్టు విజయోత్సవాలు జరుపుతున్న సమయంలో వివాదం రాజుకుంది. ఆర్మీ జట్టు తమ డగౌట్ ముందు విజయాన్ని ఉద్దేశించి ఉద్రిక్తత పెంచేలా ప్రదర్శన చేయడంతో WAPDA జట్టు ఆటగాళ్లు ఆగ్రహానికి గురయ్యారు.

ఘర్షణ తీవ్రమై ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, కాలితో తన్నులు విసురుకున్నారు. ఈ పోరాటంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన అధికారులు, రిఫరీ కూడా గాయాలపాలయ్యారు. ముఖ్యంగా, రిఫరీ తీసుకున్న ఒక పెనాల్టీ నిర్ణయం ఆర్మీకి అనుకూలంగా ఉందంటూ WAPDA ఆటగాళ్లు ఆరోపించారు. దీనిపై అప్పటికే అసహనంలో ఉన్న WAPDA ఆటగాళ్లు, ఆర్మీ విజయోత్సవాల తర్వాత రిఫరీని వెంటాడి దాడి చేసినట్లు సమాచారం.

ఈ అవాంఛనీయ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ హింసాత్మక ఘటనపై పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్, పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్ వేర్వేరుగా విచారణ చేపడుతున్నాయి. బాధ్యులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో పాకిస్తాన్ క్రీడా వర్గాల్లో ఆందోళన నెలకొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story