విరాట్ కోహ్లీ

Virat Kohli: ఇంగ్లాండ్‌తో గురువారం కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ, 66 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి టీమ్ ఇండియా 233 పరుగుల స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అర్ధశతకంతో ఇంగ్లండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన విదేశీ బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
కోహ్లీకి ఇంగ్లాండ్‌లో ఇది 19వ అర్ధశతకం. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (18 అర్ధశతకాలు) పేరిట ఉండేది, తాజాగా కోహ్లీ అతన్ని అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీ సాధించిన 19 అర్ధశతకాల్లో.. 13 వన్డేల్లో, 5 టెస్టుల్లో, ఒకటి టీ20లో నమోదయ్యాయి.
అయితే, ఇంగ్లండ్ గడ్డపై అత్యధికంగా 50కి పైగా స్కోర్లు (సెంచరీలు + అర్ధశతకాలు కలిపి) సాధించిన విదేశీ బ్యాటర్ల రికార్డును వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, స్టీవ్ స్మిత్ సంయుక్తంగా పంచుకుంటున్నారు. వీరిద్దరూ ఇంగ్లండ్‌లో 26 సార్లు 50 పరుగుల మార్కును దాటారు. రిచర్డ్స్ తన కెరీర్‌లో ఇంగ్లండ్‌లో 9 సెంచరీలు, 17 అర్ధశతకాలు సాధించగా, స్మిత్ 8 సెంచరీలు, 18 అర్ధశతకాలతో సమానంగా నిలిచారు.
ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక విదేశీ గడ్డపై అత్యధికంగా 50కి పైగా స్కోర్లు సాధించిన రికార్డు వివ్ రిచర్డ్స్ పేరిట ఉంది. ఆయన 1976 నుండి 1989 మధ్య ఆస్ట్రేలియాలో ఆడిన 95 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, 42 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అందులో 7 సెంచరీలు, 35 అర్ధశతకాలు ఉన్నాయి.

