Virat Kohli: స్కూల్ వాతావరణాన్ని మిస్ అయ్యా.. దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కోహ్లీ ఎమోషనల్
దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కోహ్లీ ఎమోషనల్

Virat Kohli: మైదానంలో పరుగుల వరద పారించే కింగ్ కోహ్లీ.. ఇప్పుడు స్కూల్ విద్యార్థులకు తన జీవిత పాఠాలను నేర్పించారు. ఢిల్లీలోని ఆర్కే పురం పబ్లిక్ స్కూల్‌లో నూతన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన విరాట్.. తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
నాకు స్టేజ్ మీద ప్రసంగించే అలవాటు లేదు.. అందుకే కాస్త ఇబ్బందిగా ఉంది అంటూ నవ్వుతూ తన మాటలను ప్రారంభించారు విరాట్. "క్రికెట్ కోసం చాలా ఏళ్ల క్రితమే స్కూల్ వాతావరణానికి దూరమయ్యాను. కానీ, మన జీవితంలో పాఠశాల పాత్ర అత్యంత కీలకమైంది. భవిష్యత్తులో మనం ఉన్నతంగా ఎదిగేందుకు పునాది పడేది ఇక్కడే. అందుకే మీ పాఠశాలను, మీకు విద్యాబుద్ధులు నేర్పే గురువులను మనస్ఫూర్తిగా గౌరవించండి" అని హితవు పలికారు.
తన సక్సెస్ మంత్రాన్ని విద్యార్థులతో పంచుకుంటూ.. "నేను ఎనిమిదేళ్ల వయసు నుంచే క్రికెట్ అకాడమీలో చేరాను. నా కలల పట్ల నేను ఎంతో నిజాయతీగా ఉన్నాను. మనం ఎంచుకున్న మార్గంపై మనకు నమ్మకం ఉండాలి. వంద శాతం అంకితభావంతో పనిచేస్తే విజయం వరిస్తుంది. మీరు చేసే పనిలో ఎంత నిజాయతీగా ఉన్నారనేది ప్రపంచానికి తెలియకపోయినా.. మీ మనస్సాక్షికి మాత్రం కచ్చితంగా తెలుస్తుంది" అని స్పష్టం చేశారు.
అకాడమీలోని సదుపాయాలను చూసి సంతోషం వ్యక్తం చేసిన కోహ్లీ.. క్రికెట్ విలువను తెలుసుకొని నేర్చుకోవాలని అక్కడి విద్యార్థులకు సూచించారు. కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెబుతూ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

