బీసీసీఐ నిర్ణయంపై చర్చ

BCCI’s Decision: భారత క్రికెట్ జట్టులో క్రికెటర్ల ఫిట్‌నెస్ నిబంధనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యో-యో టెస్టుతో పాటు బ్రాంకో టెస్టును కూడా బీసీసీఐ తప్పనిసరి చేయడంతో ఆటగాళ్లందరూ ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మాత్రం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కాకుండా, లండన్‌లోనే తన ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించుకోవడంపై చర్చ మొదలైంది.

ప్రస్తుతం కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడే ఫిట్‌నెస్ టెస్టుకు హాజరయ్యేందుకు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో, క్రికెట్ అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆటగాళ్లందరికీ ఒకే రకమైన ప్రోటోకాల్ ఉండాలని, కొందరికి మినహాయింపు ఇవ్వడం సరికాదని కొందరు వాదిస్తున్నారు.

వన్డే సిరీస్‌ కోసం..

ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌కు ఎంపికయ్యే ముందు ఆటగాళ్లకు ఈ ఫిట్‌నెస్ టెస్టులు తప్పనిసరి. ప్రతి ఆటగాడు జాతీయ జట్టులోకి రావాలంటే ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి లేదా దేశవాళీ క్రికెట్‌లో ఆడాలి. ఇప్పటికే డొమెస్టిక్ క్రికెట్ ఆడిన ఆటగాళ్లకు ఈ ఫిట్‌నెస్ టెస్టుల నుంచి మినహాయింపు ఇచ్చారు.

బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, కోహ్లీ ముందస్తు అనుమతి తీసుకున్నారని, బీసీసీఐ వైద్య బృందం లండన్‌లో జరిగే పరీక్షల రిపోర్టులను పరిశీలించి బోర్డుకు నివేదిస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై భిన్న వాదనలు కొనసాగుతున్నప్పటికీ, కోహ్లీ త్వరలోనే టెస్టు రిపోర్టులను సమర్పించి జట్టులో స్థానం ఖరారు చేసుకుంటాడని భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story