Ajinkya Rahane: భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీని టెస్ట్ కెప్టెన్‌గా నియమించడమే అత్యంత కీలకమైన మలుపు అని మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డారు. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ మధ్యలోనే టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. ఆ సమయంలో హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ జట్టు ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశారని, విదేశీ గడ్డపై టీమిండియాను భయం లేని, అత్యంత దూకుడుగల జట్టుగా తీర్చిదిద్దారని రహానే కొనియాడారు.

కోహ్లీ రాకముందు వరకు టెస్టుల్లో భారత్ తరచూ రక్షణాత్మక ధోరణితో ఆడేదని, కానీ కోహ్లీ-శాస్త్రి ద్వయం ఆ ఆలోచనను పక్కనపెట్టి స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడేలా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపిందని రహానే తెలిపారు. ఒకవేళ ఫెయిల్ అయినా ఇబ్బంది లేదని, తొలి బాల్ నుంచి ప్రత్యర్థిపై దాడి చేయాలనే వ్యూహాన్ని అమలు చేశామన్నారు. ఈ దూకుడు వల్లే టీమిండియా ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయాలు సాధించి, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిందని, తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుందని ఆయన గుర్తుచేశారు.

అయితే, ప్రస్తుతం టీమిండియా టెస్ట్ క్రికెట్ పయనంపై రహానే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశంలోనూ భారత్ టెస్టులు ఓడిపోవడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. ఆధునిక క్రికెటర్లలో టెస్టులకు సరిపడా సహనం, మానసిక దృఢత్వం కొరవడుతున్నాయని, దీనికి తక్షణమే ఫుల్‌స్టాప్ పెట్టాలన్నారు. జట్టులో ఏడుగురు నుంచి ఎనిమిది మంది అనుభవజ్ఞులైన సీనియర్లు ఉండాలని, కేవలం ఇద్దరు ముగ్గురు యువ ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాలని ఆయన సూచించారు. టెస్ట్ క్రికెట్ మనుగడ సాధించాలని కోరుకుంటూ, సీనియర్ ఆటగాళ్లను గౌరవించడం ఎంతో అవసరమని రహానే స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story