Virat Kohli Refuses to Shake Hands with Head: మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉన్నా.. మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం ప్రత్యర్థి ఆటగాళ్లను అంతే హుందాగా పలకరిస్తాడు కింగ్ కోహ్లీ. కానీ, ఈసారి మాత్రం ఉప్పల్ వేదికగా సీన్ రివర్స్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ముగిసిన తర్వాత... విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. సన్‌రైజర్స్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కోహ్లీ క్లియర్ కట్‌గా నో చెప్పేశాడు!

అసలు ఉప్పల్ గ్రౌండ్‌లో ఏం జరిగిందంటే... ఈ మ్యాచ్‌లో కోహ్లీ 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే తాను క్రీజులో ఉన్న కాసేపట్లోనే విరాట్, ట్రావిస్ హెడ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 'భారీ షాట్లు కొట్టు' అంటూ కోహ్లీని కాస్త రెచ్చగొట్టేలా హెడ్ కామెంట్ చేయడంతో ఈ గొడవ మొదలైంది. దానికి కోహ్లీ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తూ... 'నువ్వు ఆఫ్ స్పిన్ వేయడానికి వస్తే అదే చేస్తా.. అయినా నువ్వు ఎప్పుడూ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తావు కదా' అంటూ హీట్ పెంచాడు. ఈ మ్యాచ్‌లో హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ కాకపోయినా.. ఆఖర్లో ఒక ఓవర్ వేసి రజత్ పాటీదార్‌ను ఔట్ చేయడం విశేషం.

ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రావిస్ హెడ్ తన ఇన్‌స్టా స్టోరీలో... 'అవతలి వ్యక్తి ఊహించడం కూడా అసాధ్యం అన్న రీతిలో మన ప్రదర్శన ఉండాలి' అంటూ కోహ్లీకి కౌంటర్ ఇస్తున్నట్లుగా ఓ పోస్ట్ పెట్టాడు.అయితే అసలైన హైడ్రామా మ్యాచ్ ముగిసిన తర్వాతే జరిగింది. ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో... సన్‌రైజర్స్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చిన కోహ్లీ.. ట్రావిస్ హెడ్ చేయి చాచినా కనీసం పట్టించుకోకుండా, పూర్తిగా విస్మరించి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్‌కు మాత్రం షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. దాంతో హెడ్ కొన్ని క్షణాల పాటు షాక్‌తో అలానే చూస్తూ ఉండిపోయాడు.

దీనిపై లైవ్ కామెంటేటరీలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ... 'హెడ్ చేయి ఇచ్చినా విరాట్ పట్టించుకోలేదు. మైదానంలో జరిగిన గొడవే దీనికి కారణమై ఉండొచ్చు' అని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ల్లో స్లెడ్జింగ్ సహజమే అయినా.. మ్యాచ్ తర్వాత కోహ్లీ ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోవడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story