గావస్కర్ సంచలన వ్యాఖ్యలు..

Gavaskar’s Sensational Comments: భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపిక కావడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న సిరీస్‌కు గిల్‌ను కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో, ఈ నిర్ణయం రాబోయే కాలంలో కొన్ని చేదు వార్తలకు ఆరంభం కావచ్చునని గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు త్వరలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటారా? అనే చర్చలకు తావిచ్చాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు ఆటగాడిగా మాత్రమే కొనసాగుతాడని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.

రోహిత్‌ను తప్పించడానికి కారణం అదేనా?

రోహిత్ స్థానంలో గిల్‌కు కెప్టెన్సీ అప్పగించడం మంచి నిర్ణయమే అయినా, దీని వెనుక పెద్ద ప్రణాళికే ఉందని గావస్కర్ అన్నారు. ‘‘వన్డే వరల్డ్ కప్ - 2027 కోసం రోహిత్ శర్మ సిద్ధంగా ఉంటాడని నేను అనుకోవడం లేదు. రాబోయే రెండేళ్లలో మన జట్టుకు ఇంటర్నేషనల్ క్యాలెండర్‌లో ఎక్కువ వన్డేలు లేవు. సంవత్సరానికి ఆరేడు మాత్రమే ఆడితే వారికి సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్ దొరకదు. వరల్డ్ కప్‌ కోసం ఆ సన్నద్ధత సరిపోదు. ఈ కారణంగానే గిల్‌ను ముందుగా సిద్ధం చేసేందుకు బీసీసీఐ కెప్టెన్సీ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని గావస్కర్ వ్యాఖ్యానించారు.

దేశవాళీలో ఆడకపోతే ముప్పు తప్పదు!

రోహిత్, విరాట్ కోహ్లి లాంటి సీనియర్లకు ప్రాక్టీస్ దొరకడంపై గావస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. "కేవలం అంతర్జాతీయ మ్యాచుల్లోనే ఆడితే రోహిత్, విరాట్‌కు అవసరమైన ప్రాక్టీస్ దొరకదు. రాబోయే రెండేళ్లకు వారు ఎలా సిద్ధంగా ఉంటారో చెప్పలేకపోతే.. అభిమానులు మరిన్ని చేదు వార్తలను వినాల్సి వస్తుంది. 2027 వన్డే ప్రపంచకప్‌కి బరిలోకి దిగుతామని బలంగా చెప్పాలంటే, అంతర్జాతీయ వన్డేల్లోనే కాకుండా.. విజయ్ హజారే వంటి దేశవాళీ ట్రోఫీల్లో కూడా ఇద్దరూ పాల్గొనాలని గావస్కర్ సూచించారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్, విరాట్ భవితవ్యం రాబోయే టోర్నీల్లో వారి ఆటతీరుపైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story