Rishabh Pant: ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ప్రస్థానం అత్యంత దారుణంగా కొనసాగుతోంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించిన రిషబ్ పంత్ సేన, పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పడిపోయి 'బాటమ్'కు చేరుకుంది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు పోరాడి ఓడిపోవడం జట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఈ ఓటమి అనంతరం కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. జట్టుకు ప్రస్తుతం మానసిక ప్రశాంతత కోసం ఒక "బ్రేక్" అవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓటమి అనంతరం ప్రెజెంటేషన్ వేడుకలో పంత్ తన మనసులోని మాటను బయటపెట్టారు. "ఖచ్చితంగా మాకు ఇప్పుడు ఒక విరామం అవసరం. ఆటగాళ్లందరూ రీఫ్రెష్ కావాలి. ఐపీఎల్‌లో ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటుంది, కానీ దానికి సమాధానాలు మనం లోపలే వెతుక్కోవాలి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించాలి. ఒకటి లేదా ఇద్దరు ఆటగాళ్లపైనే ఆధారపడితే సరిపోదు, ఇదొక టీమ్ గేమ్‌. జట్టుగా మేమంతా జవాబుదారీతనం వహించాల్సిందే" అని పంత్ స్పష్టం చేశారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసినా (మార్క్రామ్, మార్ష్ ఓపెనింగ్) ఫలితం లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

మహ్మద్ షమీ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లినా, అక్కడ లక్నో ఘోరంగా విఫలమైంది. ఫామ్‌లో లేని నికోలస్ పూరన్‌ను సునీల్ నరైన్ ఎదుర్కోవడానికి పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పంత్ స్పందిస్తూ.. "మేమంతా చర్చించుకున్నాకే పూరన్‌ను పంపాలని నిర్ణయించుకున్నాం. అతను ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో లేకపోవచ్చు, కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన ఆటగాళ్లను మనం నమ్మాలి. దురదృష్టవశాత్తు అది వర్కౌట్ కాలేదు, దానికి ఎలాంటి వంకలు వెతకడం లేదు" అని చెప్పారు.

కేకేఆర్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్ క్రీజులో ఉండగా, స్పిన్నర్ దిగ్వేష్ రాఠీకి బంతిని అందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఓవర్‌లో రింకూ వరుసగా నాలుగు సిక్సర్లు బాదడంతో కేకేఆర్ స్కోరు 155కు చేరింది. ఈ నిర్ణయం గురించి పంత్ మాట్లాడుతూ.. "కొన్నిసార్లు బౌలర్లు కఠినమైన ఓవర్లు వేయాల్సి ఉంటుంది. వికెట్ తీస్తాడనే నమ్మకంతోనే అతనికి బంతిని ఇచ్చాను, కానీ ఆశించిన ఫలితం రాలేదు. మైదానంలో ఎక్కువ ఆలోచనలు ఉండటం వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది" అని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

ప్రస్తుతానికి లక్నో పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నా, విరామం తర్వాత బలంగా పుంజుకుంటామని పంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story