యాషెస్ ఓటమిపై బెన్ స్టోక్స్ రియాక్షన్

Ben Stokes Reacts to Ashes Defeat: సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 4-1తో ముగించింది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ సెషన్‌లో బెన్ స్టోక్స్ తన కెప్టెన్సీ భవిష్యత్తు గురించి నేరుగా స్పందించడానికి ఇష్టపడలేదు. అయితే, జట్టుగా ఎక్కడ విఫలమయ్యామనే విషయాన్ని మాత్రం నిజాయితీగా అంగీకరించారు. "ఐదో రోజు వరకు సాగే టెస్ట్ మ్యాచ్‌లు ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఒకవేళ బోర్డుపై మేము మరో 200 పరుగులు అదనంగా జోడించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆస్ట్రేలియా ఒక అద్భుతమైన జట్టు, వారు అత్యుత్తమ క్రికెట్ ఆడారు. వారి బౌలర్లు చాలా పటిష్టంగా ఉన్నారు, అందుకే ఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు" అని స్టోక్స్ ప్రత్యర్థి జట్టును అభినందించారు.

ఇంగ్లాండ్ జట్టు తన తదుపరి టెస్ట్ సిరీస్‌ను జూన్ (2026) లో న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. అంటే తప్పులను సమీక్షించుకోవడానికి ఇంగ్లాండ్‌కు దాదాపు ఐదు నెలల సమయం ఉంది. "మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సి ఉంది. తదుపరి సిరీస్ ప్రారంభానికి చాలా సమయం ఉంది, కాబట్టి మేము ఆత్మపరిశీలన చేసుకుని మా తప్పులను సరిదిద్దుకుంటామని ఆశిస్తున్నాను" అని స్టోక్స్ తన నాయకత్వాన్ని కొనసాగించే దిశగానే సంకేతాలిచ్చారు.

సిడ్నీ టెస్ట్ నాలుగో రోజున బెన్ స్టోక్స్ కండరాల గాయంతో మైదానాన్ని వీడటం అభిమానులను కలవరపెట్టింది. ఇప్పటికే మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ వంటి కీలక బౌలర్లు గాయాలతో దూరమవ్వగా, ఇప్పుడు కెప్టెన్ గాయం కూడా జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, బెన్ స్టోక్స్ ద్వయంపై ఈసీబీ (ECB) ఇంకా నమ్మకంతోనే ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ ఐదు నెలల విరామంలో జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story