Wedding Bells for Kuldeep Yadav: టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచిన జోష్‌లో ఉన్న టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇప్పుడు తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్సికతో కలిసి ఆయన ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ వివాహ వేడుక మార్చి 14న ఉత్తరాఖండ్‌లోని అందమైన హిల్ స్టేషన్ ముస్సోరీలో అత్యంత వైభవంగా జరగనుంది.

కాన్పూర్‌కు చెందిన ఈ జంట మధ్య చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. కుల్దీప్ లాల్ బంగ్లా ప్రాంతంలో ఉండగా, వన్సిక ఇల్లు అక్కడికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోని శ్యామ్ నగర్‌లో ఉంది. వీరిద్దరి స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు వచ్చింది. వన్సిక ప్రస్తుతం ఎల్‌ఐసీ (LIC)లో అధికారిణిగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ గతేడాది జూన్ 4న లక్నోలో నిశ్చితార్థం జరిగింది. నిజానికి ఈ పెళ్లి 2025 నవంబర్‌లోనే జరగాల్సి ఉన్నప్పటికీ, టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ కారణంగా వాయిదా పడింది.

పెళ్లి వేడుకలు మార్చి 13న హల్దీ, మెహందీ కార్యక్రమాలతో ముస్సోరీలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో మొదలవుతాయి. మార్చి 14న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుగుతుంది. అనంతరం మార్చి 17న లక్నోలోని హోటల్ సెంట్రమ్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు క్రికెట్ తారలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

కుల్దీప్ తండ్రి రామ్ సింగ్ యాదవ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి, నేడు ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన కుల్దీప్ పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ ట్రోఫీని గెలిచిన కొద్దిరోజుల్లోనే కుల్దీప్ ఒక ఇంటివాడు కాబోతుండటంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story