బంగ్లా ఆల్‌రౌండర్ మహెదీ హసన్

Bangladesh All-Rounder Mahedi Hasan: భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి బంగ్లాదేశ్ జట్టు భాగస్వామ్యంపై గత కొన్ని రోజులుగా సందిగ్ధత కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును భారత్‌కు పంపే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఇప్పటికే ఐసీసీకి స్పష్టం చేసింది. అయితే, ఈ గందరగోళ పరిస్థితులపై ఆ జట్టు ఆల్‌రౌండర్ మహెదీ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వార్తా సంస్థలతో మాట్లాడిన మహెదీ హసన్, మైదానం బయట జరుగుతున్న పరిణామాలతో ఆటగాళ్లకు సంబంధం లేదని స్పష్టం చేశారు. "ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి అనేది పూర్తిగా మేనేజ్‌మెంట్, అధికారులకు సంబంధించిన సమస్య. ఆ విషయాలను వారే డీల్ చేస్తారు. క్రికెటర్లుగా మా పని కేవలం మైదానంలోకి దిగి ఆడటం మాత్రమే. అది భారత్ అయినా, మరే దేశం అయినా మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు మమ్మల్ని అంగారక గ్రహానికి (Mars) పంపినా సరే, అక్కడికి వెళ్లి కూడా ఆడతాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం, అలాగే ఐపీఎల్ నుంచి బంగ్లా స్పీడ్‌స్టర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విడుదల చేయడం వంటి పరిణామాలు ఈ వివాదానికి కారణమయ్యాయి. తమ దేశ ఆటగాళ్లకు భారత్‌లో భద్రత ఉండదని భావిస్తున్న బంగ్లా బోర్డు, తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరుతోంది.

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ తన గ్రూప్ మ్యాచులను కోల్‌కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది. అయితే ఆటగాళ్లు మాత్రం వేదికతో సంబంధం లేకుండా ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని మహెదీ హసన్ మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఐసీసీ దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story