West Indies Create World Record: 50 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వెస్టిండీస్
ప్రపంచ రికార్డు సృష్టించిన వెస్టిండీస్

West Indies Create World Record: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ వన్డే (ODI) మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధించింది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మంగళవారం (అక్టోబర్ 21, 2025) జరిగిన ఈ మ్యాచ్‌లో, వెస్టిండీస్ తమ 50 ఓవర్ల కోటాను పూర్తిగా స్పిన్ బౌలర్లతోనే పూర్తి చేసింది. అంతర్జాతీయ వన్డే చరిత్రలో ఒక ఫుల్ మెంబర్ దేశం ఈ రికార్డును నమోదు చేయడం ఇదే మొదటిసారి. సీరీస్‌లో 1-0తో వెనుకబడిన వెస్టిండీస్, పిచ్ పరిస్థితులను అంచనా వేసి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. పిచ్ నెమ్మదిగా ఉండి, స్పిన్నర్లకు బాగా అనుకూలించడంతో, జట్టు ఫాస్ట్ బౌలర్లను పక్కన పెట్టి, ఐదుగురు స్పిన్నర్లతో (అకేల్ హోసేన్, రోస్టన్ ఛేజ్, గుడాకేష్ మోటీ, ఖారీ పియర్, అలిక్ అథనాజ్) బౌలింగ్ చేసింది. ఈ ఐదుగురు స్పిన్నర్లు తలో 10 ఓవర్లు వేశారు. వెస్టిండీస్ స్పిన్ దళం ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుడాకేష్ మోటీ 3 వికెట్లు పడగొట్టగా, పార్ట్‌టైమ్ స్పిన్నర్ అలిక్ అథనాజ్ తన 10 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. బంగ్లా బ్యాటర్లలో సౌమ్య సర్కార్ (45), రిషాద్ హుస్సేన్ (39 నాటౌట్) రాణించారు. వెస్టిండీస్ కూడా తమ ఇన్నింగ్స్‌లో సరిగ్గా 213 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో వెస్టిండీస్ విజయం సాధించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ చారిత్రక స్పిన్ వ్యూహం వెస్టిండీస్‌కు విజయాన్ని అందించింది. వన్డేల్లో అత్యధికంగా స్పిన్ బౌలింగ్ చేసిన జట్టుగా గతంలో శ్రీలంక పేరిట రికార్డు ఉండేది. 1996లో శ్రీలంక 44 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేసింది. ఇప్పుడు వెస్టిండీస్ 50 ఓవర్లతో ఆ రికార్డును బద్దలు కొట్టింది.
