PM Modi: ఆమె చేసింది సామాన్యమైన పని కాదు..లవ్లీనాపై ప్రధాని మోదీ ప్రశంసలు
లవ్లీనాపై ప్రధాని మోదీ ప్రశంసలు

PM Modi: క్రీడా వేదికలపై దేశం తరఫున పతకాలు గెలవడమే కాదు.. దేశంపై మమకారాన్ని, జాతీయ సమైక్యతను ఏ క్షణంలోనూ విస్మరించకూడదని నిరూపించింది ప్రముఖ భారతీయ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బొర్గోహైన్. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన లవ్లీనా.. అక్కడ జరిగిన ఒక సంఘటనతో దేశం గర్వపడేలా చేసింది. తాజాగా ఆమె చేసిన ఆ సాహసోపేత పనిపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లు ఆదివారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని తమ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారితో సరదాగా ముచ్చటించిన ప్రధాని మోదీ.. బాక్సర్ లవ్లీనాను ఉద్దేశించి నవ్వుతూ.."అసలేం జరిగింది? మీరు ఆ రెస్టారెంట్‌తో ఎందుకు గొడవ పడ్డారు?" అంటూ సరదాగా ప్రశ్నించారు. దానికి లవ్లీనా నవ్వుతూ బదులిస్తూ.. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత ఆనందంగా సంబరాలు చేసుకునేందుకు తామంతా గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లామని చెప్పారు.
అయితే అక్కడ ఉన్న భారత్ చిత్రపటంలో (మ్యాప్‌లో) ఈశాన్య రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌కు సంబంధించిన కొన్ని సరిహద్దులు అసంపూర్తిగా ఉండడాన్ని ఆమె గమనించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన లవ్లీనా.. వెంటనే ఆ రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి, అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె నిలదీయడంతో దిగివచ్చిన రెస్టారెంట్ యాజమాన్యం వెంటనే తప్పును సరిదిద్దుకుంటామని క్షమాపణలు చెప్పింది.
ఈ ఉదంతంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. విజయానందంలో, సంబరాల్లో మునిగి ఉన్న సమయంలో కూడా దేశ చిత్రపట ప్రాముఖ్యతను గుర్తించడం సాధారణమైన విషయం కాదన్నారు. దేశంపై ప్రేమ అనేది కేవలం పతకాలు గెలిచేటప్పుడే కాకుండా, గుండెల్లో ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటుందని లవ్లీనా నిరూపించిందని కొనియాడారు. "లవ్లీనా చేసిన ఆ పని సాధారణమైనది కాదు.. ఆ వీడియోను దేశ ప్రజలు సుదీర్ఘకాలం గుర్తుంచుకుంటారు అంటూ ప్రధాని మోదీ ఆమె దేశభక్తిని అభినందించారు.

