తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌ పాలకమండలి సమావేశంలో సీయం రేవంత్‌రెడ్డి

ఖేలో ఇండియా, కామ‌న్ వెల్త్‌, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వ‌హించినా వాటిలో తెలంగాణ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వ‌హ‌ణ‌, వ‌స‌తులు మెరుగుప‌ర్చ‌డం, కోచ్‌లు, ట్రైన‌ర్‌ల‌కు శిక్ష‌ణ‌, క్రీడా పాల‌సీలో వివిధ అంశాల‌పై ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌, అమ‌లుకు స‌బ్ క‌మిటీల ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానాలను ఆమోదించింది. హైదరాబాద్ లో జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ పాలక మండలి తొలి స‌మావేశంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడ‌ల ప్రోత్సాహం విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ హైద‌రాబాద్ గురించి మాట్లాడుకోవాల‌నేదే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. క్రీడా ప్ర‌పంచానికి హైద‌రాబాద్ వేదిక‌గా మారాల‌ని ఆకాంక్షించారు.

తెలంగాణ‌కు ఐటీ సంస్కృతి ఉంద‌ని, రాష్ట్రంలోని ప్ర‌తి కుటుంబం త‌మ పిల్ల‌లు ఐటీ రంగంలో ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని, ఆ తరహాలోనే క్రీడా సంస్కృతి రావాల‌ని తాను అభిల‌షిస్తున్న‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. క్రీడా రంగం ప్రోత్సాహానికిగానూ గ‌తంతో పోల్చితే 16 రెట్లు బ‌డ్జెట్ పెంచామ‌ని చెప్పారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారుల‌కు ప్రోత్సాహాకాలు ఇవ్వ‌డంతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పించామన్నారు. క్రీడా రంగం ప్రాధాన్య‌త‌ను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టేడియాలు, అధునాత‌న ప‌రిక‌రాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రావడం లేదన్నారు. వాటిని స‌మ‌గ్రంగా స‌ద్వినియోగం చేసుకోవ‌డంతో పాటు క్రీడా రంగంలో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలిపేందుకు బోర్డు త‌గిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాలని అభిలషించారు. క్రీడా రంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వ‌హ‌ణ‌ అవ‌స‌ర‌మైనందునే బోర్డులో ప్ర‌ముఖ కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహ‌కుల‌కు చోటు క‌ల్పించామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో స్పోర్ట్ హబ్ చైర్మన్, ఆర్ పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ చైర్మన్ డాక్టర్ సంజీవ్ గోయెంకా, హబ్ కో-చైర్ పర్సన్ ఉపాసన కొణిదెల, సభ్యులు, ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్, ప్ర‌ముఖ షూట‌ర్ అభినవ్ బింద్రా, ధాని ఫౌండేష‌న్ వీతా ధాని, బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, విశ్వ స‌ముద్ర ఫౌండేష‌న్ చింతా శ‌శిధ‌ర్, క్రీడా నిర్వాహ‌కులు బియ్యాల పాపారావు, ఫుట్ బాల్ టీమ్ మాజీ కెప్టెన్ భైచుంగ్‌ భూటియా, ప్ర‌ముఖ వాలీబాల్ క్రీడాకారుడు రవికాంత్ రెడ్డి, ఏఐపీఎస్ – ఏసియా వైఎస్ ప్రెసిడెంట్ సబా నాయకన్ తదితరులు తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న క్రీడా పోటీల విధానాన్ని మార్చుతూ గ్రామ‌, మండ‌ల, శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి పోటీలు నిర్వ‌హిస్తామ‌ని ప్రకటించారు. శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో విజేత‌లుగా నిలిచిన జ‌ట్ల మ‌ధ్య పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి పోటీలు నిర్వ‌హించి అంతిమంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వ‌హించి రాష్ట్ర స్థాయి జ‌ట్ల‌ను ఎంపిక చేస్తామ‌ని సీయం రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ స‌మావేశంలో క్రీడా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి, ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ముఖ్య‌ కార్య‌ద‌ర్శి జయేష్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ శివసేనా రెడ్డి, ఎండీ సోని బాల దేవి తదితరులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story