Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ ఏషియన్ గేమ్స్ కల నెరవేరుతుందా? ఇవాళ సుప్రీంకోర్టులో తేలనున్న భవితవ్యం!
ఇవాళ సుప్రీంకోర్టులో తేలనున్న భవితవ్యం!

Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మధ్య నడుస్తున్న వివాదం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ పాల్గొనేందుకు ఇటీవల దిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. WFI దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టులో అత్యంత కీలకమైన విచారణ జరగనుంది.
మరోవైపు మే 30, 31 తేదీల్లో ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ జరగాల్సి ఉంది. సరిగ్గా ట్రయల్స్ ప్రారంభానికి ముందే ఈ సుప్రీం విచారణ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు ఈ వ్యవహారంపై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. భారత రెజ్లింగ్ సమాఖ్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసియా క్రీడల కోసం డబ్ల్యూఎఫ్‌ఐ నిర్దేశించిన ఎంపిక ప్రమాణాలు వివక్షపూరితంగా ఉన్నాయని కోర్టు తప్పుబట్టింది. ఫెడరేషన్ నిర్ణయించిన రూల్స్, అథ్లెట్ల గత ప్రదర్శనలను అస్సలు పరిగణనలోకి తీసుకునేలా లేవని వ్యాఖ్యానించింది.
ముఖ్యంగా, ఎంపిక ట్రయల్స్ నుంచి వినేశ్‌ను మినహాయించడం.. ఆమె తీసుకున్న ప్రసూతి విరామానికి (Maternity Leave) నేరుగా ముడిపడి ఉందని దిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, మే 9న వినేశ్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ జారీ చేసిన షోకాజ్ నోటీసులోని అంశాలపై కూడా కోర్టు మండిపడింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అధిక బరువు కారణంగా వినేశ్ అనర్హతకు గురికావడాన్ని.. ‘దేశానికి జరిగిన అవమానం’ అని నోటీసులో పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రయల్స్‌లో వినేశ్ పాల్గొనేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ డబ్ల్యూఎఫ్‌ఐ చేసిన వాదనలను పూర్తిగా తిరస్కరించింది.
హైకోర్టు ఆదేశాలతో వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల రేసులోకి వచ్చిందని ఆనందించేలోపే.. WFI సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. మరి ఇవాళ జరగబోయే విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది? వినేశ్‌కు ఏషియన్ గేమ్స్ ట్రయల్స్ ఆడే అవకాశం దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

