ముంబైపై గ్రాండ్ విక్టరీ

Women's Premier League (WPL) 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలన విజయం సాధించింది. జనవరి 9న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ముంబై ఇండియన్స్ 154/6 (20 ఓవర్లు) చేయగా టార్గెట్ బరిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 157/7 (20 ఓవర్లు) చేసింది.

ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ నాడిన్ డి క్లెర్క్ అద్భుత ప్రదర్శన చేసింది. తొలుత బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆమె, బ్యాటింగ్‌లోనూ 63 (44 బంతులు) పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఆఖరి ఓవర్‌లో బెంగళూరు గెలుపుకు 18 పరుగులు కావాలి. నటాలీ స్కివర్ బ్రంట్ వేసిన ఆ ఓవర్ తొలి రెండు బంతులు డాట్ అయ్యాయి. కానీ, ఆ తర్వాత డి క్లెర్క్ వరుసగా 6, 4, 6, 4 బాది ఆఖరి బంతికి జట్టును గెలిపించింది.ముంబై జట్టులో సజీవన్ సజన (45), నికోలా కేరీ (40) రాణించారు. ఒకానొక దశలో తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న ముంబైని వీరిద్దరూ ఆదుకున్నారు.

లక్ష్య ఛేదనలో స్మృతి మంధాన (18), గ్రేస్ హారిస్ (25) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. మధ్యలో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ, అరుంధతి రెడ్డి (20) తో కలిసి డి క్లెర్క్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.ఈ విజయంతో ఆర్సీబీ 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించడమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story