ఎల్లీస్ పెర్రీ రికార్డు బద్దలు

Women's Premier League (WPL) 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ (WPL) 2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన ఆమె, ఆస్ట్రేలియా దిగ్గజం ఎల్లీస్ పెర్రీ రికార్డును అధిగమించింది. తద్వారా డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మంధాన అగ్రస్థానానికి చేరుకుంది.

ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఎల్లీస్ పెర్రీ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆర్సీబీ విజయావకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన మంధాన, వరుస విజయాలతో జట్టును నేరుగా ఫైనల్‌కు చేర్చింది. ఫైనల్‌కు ముందు 936 పరుగులతో ఉన్న మంధాన, ఈ మ్యాచ్‌లో సాధించిన 87 పరుగులతో కలిపి మొత్తం 1023 పరుగులకు చేరుకుంది. అంతకుముందు పెర్రీ 972 పరుగులతో టాప్‌లో ఉండేది.

ఈ క్రమంలో మంధాన మరిన్ని అద్భుత రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది:

1000 పరుగుల క్లబ్: డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో క్రికెటర్‌గా మంధాన నిలిచింది. అంతకుముందు నాట్ సీవర్ బ్రంట్, మెగ్ లానింగ్, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు.

రికార్డు భాగస్వామ్యం: జార్జియా వోల్‌తో కలిసి మంధాన నెలకొల్పిన 165 పరుగుల భాగస్వామ్యం, డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ఏ వికెట్‌కైనా అత్యధిక స్కోరుగా రికార్డు సృష్టించింది.

సెంచరీ భాగస్వామ్యాల రికార్డు: డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు సార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకుని, ముంబై ఇండియన్స్ ప్లేయర్ నాట్ సీవర్ బ్రంట్ (5 సార్లు) రికార్డును స్మృతి అధిగమించింది.

ఆరెంజ్ క్యాప్ విజేత: 2026 సీజన్‌లో మొత్తం 377 పరుగులు సాధించిన మంధాన, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచి 'ఆరెంజ్ క్యాప్' గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా ఆమె రికార్డు సృష్టించింది.

మొత్తానికి, ఒకవైపు జట్టుకు రెండో టైటిల్ అందించడమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా మంధాన రికార్డుల వేటను కొనసాగించి మహిళా క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story