బంగ్లాదేశ్‌పై శ్రీలంక సంచలన విజయం

Women’s World Cup 2025: ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ (CWC25) టోర్నమెంట్‌లో శ్రీలంక మహిళల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టుపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నమెంట్‌లో తమ మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ ఒకానొక దశలో విజయం దిశగా సాగింది. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 9 పరుగులు అవసరం కాగా, కెప్టెన్ చమరి అత్తాపత్తు అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఈ ఓవర్‌లో బంగ్లాదేశ్ కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి, ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు (ఒక రనౌట్, మూడు వికెట్లు) కోల్పోవడంతో బంగ్లా ఇన్నింగ్స్ కుప్పకూలింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ హసిని పెరీరా (85 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. కెప్టెన్ చమరి అత్తాపత్తు (46) కూడా విలువైన పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షార్నా అక్తర్ 3 వికెట్లు పడగొట్టింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా జ్యోతి (77 పరుగులు), షర్మిన్ అక్తర్ (64) అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే, చివరి ఐదు ఓవర్లలో శ్రీలంక బౌలర్లు పట్టు బిగించడంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది.శ్రీలంక కెప్టెన్ చమరి అత్తాపత్తు బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి 4 వికెట్లు (4/42) పడగొట్టింది. ముఖ్యంగా, చివరి ఓవర్‌లో ఆమె వేసిన స్పెల్ మ్యాచ్‌ను శ్రీలంక వైపు మలుపడంలో కీలకపాత్ర పోషించింది. ఈ విజయంతో శ్రీలంక సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story