Yash Dayal Breaks Silence: ఆర్సీబీకి దూరం కావడంపై మౌనం వీడిన యశ్ దయాళ్
మౌనం వీడిన యశ్ దయాళ్

Yash Dayal Breaks Silence: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బౌలర్ యశ్ దయాళ్ ఎందుకు దూరమయ్యాడు? అతడిని జట్టు పక్కన పెట్టిందా.. లేక ఆయనే తప్పుకున్నాడా? ఈ సస్పెన్స్‌పై ఎట్టకేలకు యశ్ దయాళ్ మౌనం వీడాడు. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌ను, మ్యాచ్‌లను తాను ఎంతగానో మిస్ అవుతున్నానని చెబుతూనే.. టోర్నమెంట్ నుండి వైదొలగడం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాడు.
యశ్ దయాళ్ మాట్లాడుతూ.. ఆర్సీబీ నా జట్టు. వారు నన్ను టీమ్ నుంచి తొలగించలేదు, నన్ను 'రిటైన్' జాబితాలోనే ఉంచారు. నా స్థానంలో వేరే ఎవరినీ కూడా తీసుకోలేదు. బహుశా నేను జట్టులో ఒక ముఖ్యమైన భాగమని వారు భావిస్తున్నారు. అయితే, ఈ సీజన్ నుంచి తప్పుకోవడం నా వ్యక్తిగత నిర్ణయం కాదు. ఈ వ్యాఖ్య వివాదాస్పదంగా అనిపించవచ్చు కానీ.. ఆ నిర్ణయాన్ని ఎప్పుడూ యాజమాన్యమే తీసుకుంటుంది. ఆర్సీబీ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో నాకు పూర్తిగా తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంట్లో కూర్చొని ఆర్సీబీ మ్యాచ్‌లను టీవీలో చూడటం మానసికంగా ఎంతో సవాల్‌గా ఉందన్నాడు యశ్ దయాళ్. అయితే యాజమాన్యంతో, కోచ్‌తో, అలాగే దినేశ్ కార్తీక్‌తో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని.. తమ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదని స్పష్టం చేశాడు.
యశ్ దయాళ్ కెరీర్ పరంగా అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. యశ్ దయాళ్‌పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలోనే.. ఆర్సీబీ యాజమాన్యం అతడిని ఈ సీజన్‌లో ఆడొద్దని సూచించినట్లు తెలుస్తోంది. మొదట యూపీకి చెందిన ఓ యువతి దయాళ్‌పై ఆరోపణలు చేయగా.. ఆ తర్వాత రాజస్థాన్‌కు చెందిన మరో యువతి, క్రికెట్‌లో కెరీర్ చూపిస్తానని నమ్మించి రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో యశ్ దయాళ్‌పై పోక్సో (POCSO) కేసు కూడా నమోదైంది. ఈ చట్టపరమైన వివాదాల వల్లే ఆర్సీబీ అతడిని మైదానంలోకి దించలేదని స్పష్టమవుతోంది.

