Abhishek Sharma: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది, మొత్తం 38 బంతుల్లో 11 సిక్సర్లు, 9 ఫోర్లతో 113 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భారత్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ సూపర్ ఇన్నింగ్స్ అనంతరం అభిషేక్ శర్మ, అతని గురువు-మెంటార్ యువరాజ్ సింగ్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

యువరాజ్ సరదా పోస్ట్.. 12 బంతుల రికార్డు గుర్తుచేస్తూ!

అభిషేక్ ఊచకోతను చూసిన తర్వాత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఎక్స్ వేదికగా శిష్యుడిని సరదాగా ఆటపట్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో తాను ఇంగ్లండ్‌పై కేవలం 12 బంతుల్లోనే సాధించిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వరల్డ్ రికార్డును గుర్తుచేస్తూ.. "అభిషేక్.. నువ్వు ఇప్పటికీ నా లాగా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోయావు, కదా! ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు తమ పెరట్లో ఆడుకుంటున్నట్లు ఉంది" అంటూ సరదాగా పోస్ట్ చేశాడు. అయితే వెంటనే మరో ట్వీట్‌లో అభిషేక్‌ను ఆకాశానికెత్తుతూ.."నేనైతే 30 లేదా 34 బంతుల్లో 100 పరుగులు కొట్టలేనులే మిస్టర్ శర్మ.. వెల్ ప్లేడ్!" అని ప్రశంసల జల్లు కురిపించాడు.

యువీకి అభిషేక్ అదిరిపోయే సమాధానం..

మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత యువరాజ్ చేసిన వ్యాఖ్యలపై అభిషేక్ స్పందిస్తూ నవ్వేశాడు. "నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను. అప్పట్లో

యువీ పాజీ ఎలాంటి క్రికెట్ ఆడాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. కానీ 12 బంతుల్లో 50 పరుగులు చేయడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. ఏ బ్యాటర్ అయినా మైదానంలోకి అడుగుపెట్టి అలా బాదేయాలనుకుంటే అది సాధ్యపడదు. అలాంటి అద్భుతాలు ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతాయి" అని సరదాగా బదులిచ్చాడు.

రికార్డుల కోసం కాదు.. జట్టు గెలుపు కోసమే..

వ్యక్తిగత మైలురాళ్లపై స్పందిస్తూ.. తాను గానీ, మరో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గానీ ఎలాంటి రికార్డులను దృష్టిలో పెట్టుకుని ఆడలేదని అభిషేక్ స్పష్టం చేశాడు. "ఓపెనర్లుగా పవర్‌ప్లేను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని న్యూజిలాండ్‌పై ఒత్తిడి పెంచాలనేది మా ప్రణాళిక. బ్యాటర్లుగా మేము రికార్డుల కోసం ఆడము, జట్టును గెలిపించడమే మా ఏకైక లక్ష్యం. ఈ సిరీస్ అంతటా అదే దూకుడును కొనసాగించాలనుకున్నాం, అది మంచి ఫలితాన్నిచ్చింది" అని వెల్లడించాడు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్–సూర్యవంశీ జోడీ కేవలం 7.1 ఓవర్లలోనే 133 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. సూర్యవంశీ 19 బంతుల్లో 45 పరుగులు చేయగా.. పవర్‌ప్లే (తొలి 6 ఓవర్లు) ముగిసేసరికి భారత్ 118 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో ఆల్-టైమ్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఇక సిరీస్‌లో నాలుగో టీ20 మ్యాచ్ అక్టోబర్ 30న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది.

Next Story