కెరీర్ చివర్లో నన్ను అవమానించారు!

Yuvraj Singh: టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తన కెరీర్ చివరి దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ముందు తనకు జట్టు మేనేజ్‌మెంట్ నుండి ఎలాంటి స్పష్టత లభించలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్లపాటు జట్టు కోసం కీలక పాత్ర పోషించినప్పటికీ, తన భవిష్యత్తు గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీ గానీ, కోచ్ రవిశాస్త్రి గానీ, సెలక్టర్లు గానీ ముఖం చాటేశారని యువీ ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఏ విషయంలోనూ క్లారిటీ లేదు. అటు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) నుండి గానీ, ఇటు కెప్టెన్, కోచ్‌ల నుండి గానీ ఎవరూ నా పరిస్థితి ఏంటో చెప్పలేదు. 36 ఏళ్లు దాటి 37వ పడిలో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక సతమతమయ్యాను. దేశం కోసం అంతకాలం ఆడిన ఆటగాడికి కనీస గౌరవం ఇవ్వాలి, కూర్చోబెట్టి నిజం చెప్పాలి" అని యువరాజ్ పేర్కొన్నారు. కేవలం తన విషయంలోనే కాకుండా జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని ఆయన గుర్తు చేశారు.

అయితే, ఆ సందిగ్ధ సమయంలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు సరైన మార్గం చూపారని యువీ వెల్లడించారు. "నేను ధోనీతో ఫోన్లో మాట్లాడాను. ఆయనకు ఎలాంటి స్వార్థం లేదు, కానీ ఏం జరుగుతుందో ఆయనకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆయన నాకు వాస్తవ పరిస్థితులను వివరించి సరైన అవగాహన కల్పించారు" అని ధోనీ నిజాయితీని మెచ్చుకున్నారు.

అదే సమయంలో ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వకపోతే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని మేనేజ్‌మెంట్ చెప్పినప్పుడు, యువరాజ్ గట్టిగానే బదులిచ్చారట. "నా రిటైర్మెంట్ ఎప్పుడు అనేది నేనే నిర్ణయించుకుంటాను" అని వారికి స్పష్టం చేసినట్లు యువీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story