Zaheer Khan: టీమిండియా అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జట్టులో తరచూ చోటు దక్కకపోవడం, సెలెక్టర్ల పక్కన పెట్టే ధోరణిపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ పేస్ దిగ్గజం జహీర్ ఖాన్.. మహ్మద్ షమీకి ఒక స్పష్టమైన , విలువైన సందేశాన్ని అందించారు.

సెలెక్టర్ల ఆలోచనలు, జట్టు ప్రణాళికలు ఎలా ఉన్నాయనేది ఏ ఆటగాడి చేతిలోనూ ఉండదని జహీర్ ఖాన్ స్పష్టం చేశారు. ఎంపిక విషయంలో ఎదురవుతున్న ఈ పరిణామాల గురించి ఎక్కువగా ఆలోచించి మానసికంగా ఒత్తిడి తెచ్చుకోవద్దని ఆయన షమీకి హితవు పలికారు. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం కంటే, మన పనిపై మనం దృష్టి పెట్టడం ఎప్పుడూ మంచిదని జహీర్ అభిప్రాయపడ్డారు.

ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా షమీ చేతిలో ప్రస్తుతం ఉన్న ఏకైక అస్త్రం.. తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం, మైదానంలో అద్భుతమైన ప్రదర్శన కనబరచడమేనని జహీర్ గుర్తుచేశారు. జట్టులోకి పిలుపు రాకపోయినా నిరాశ చెందకుండా, ఆడుతున్న ప్రతి మ్యాచ్‌లోనూ తన స్థాయికి తగ్గట్లు రాణించి వికెట్లు పడగొట్టడంపైనే పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు.

షమీ లాంటి సీనియర్ బౌలర్ అనుభవం ఏ జట్టుకైనా ఎంతో కీలకమని జహీర్ నొక్కిచెప్పారు. ప్రస్తుతానికి సెలెక్టర్ల ప్రణాళికల్లో పేరు లేకపోయినా, తన అంకితభావం, కష్టపడే తత్వంతో షమీ మళ్లీ టీమిండియాలోకి ఘనంగా పునరాగమనం చేయడం ఖాయమని జహీర్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story