Zimbabwe: 25 ఏళ్ల తర్వాత జింబాబ్వే సంచలనం.. బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ తేడాతో చారిత్రాత్మక విజయం!
చారిత్రాత్మక విజయం!

Zimbabwe: జింబాబ్వే క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘనత నమోదైంది. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ఇన్నింగ్స్ మరియు 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను కేవలం 185 పరుగులకే కుప్పకూల్చి జింబాబ్వే ఈ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజారబాని నాలుగు వికెట్లతో చెలరేగగా, కెప్టెన్ రిచర్డ్ న్గరవా మూడు వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 140 పరుగులకే ఆలౌట్ కావడంతో.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కోలుకోలేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
అంతకుముందు, జింబాబ్వే ఓపెనర్ ఇన్నోసెంట్ కాయా చేసిన అద్భుతమైన అజేయ సెంచరీ (140 నాటౌట్) తో జింబాబ్వే తన మొదటి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన గత మూడు టెస్టుల్లో జింబాబ్వేకు ఇది రెండో విజయం కావడం విశేషం.
ఈ విజయంతో జింబాబ్వే గత 25 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌లలో (బ్యాక్ టు బ్యాక్) విజయాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతకుముందు అక్టోబర్ 2025 లో ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచిన జింబాబ్వే, ఇప్పుడు బంగ్లాదేశ్‌ను ఓడించి ఈ అరుదైన మైలురాయిని అందుకుంది. జింబాబ్వే క్రికెట్ చరిత్రలో ఇలా వరుసగా రెండు టెస్టులు గెలవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. చివరిగా 2001 లో బంగ్లాదేశ్‌పైనే స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తో క్లీన్‌స్వీప్ చేసి వరుస విజయాలు నమోదు చేసింది. అంతకుముందు 1998 లో భారత్ మరియు పాకిస్తాన్ జట్లపై వరుసగా టెస్ట్ మ్యాచ్‌లు గెలిచి చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో 227 బంతుల్లో 140 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ ఇన్నోసెంట్ కాయాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఈ విజయం మా కష్టానికి, ముఖ్యంగా మా ఫిట్‌నెస్‌కు దక్కిన ప్రతిఫలం. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. బంగ్లాదేశ్ బౌలర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారు, కానీ ఈ రోజు నా రోజని నిరూపించుకున్నాను" అని సంతోషం వ్యక్తం చేశారు.
మంగళవారం నాడు 40/1 ఓవర్‌నైట్ స్కోరుతో, ఇంకా 230 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్‌ను జింబాబ్వే బౌలర్లు ఆరంభం నుండే ఉక్కిరిబిక్కిరి చేశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (34), కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంతో (30) మాత్రమే కాస్త పట్టుదలగా ఆడారు. ఓపెనర్ మహ్మూదుల్ హసన్ జాయ్ (22) వికెట్‌ను ముజారబాని పడగొట్టడంతో బంగ్లాదేశ్ పతనం మొదలైంది. ఆ వెంటనే మోమినుల్ హక్ కూడా అవుట్ కావడంతో బంగ్లాదేశ్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రహీమ్, శాంతో కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించినప్పటికీ, అది ఇన్నింగ్స్ ఓటమిని తప్పించలేకపోయింది. జింబాబ్వే అద్భుతమైన ప్లానింగ్‌తో బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసి మరపురాని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

