Zimbabwe Crush Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన జింబాబ్వే!
చిత్తు చేసిన జింబాబ్వే!

Zimbabwe Crush Afghanistan: జింబాబ్వే క్రికెట్ జట్టు తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఇన్నింగ్స్ మరియు 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం జింబాబ్వేకు 24 ఏళ్లలో లభించిన అతిపెద్ద టెస్ట్ విక్టరీ (ఇన్నింగ్స్ విజయం పరంగా) కావడం విశేషం. అంతేకాకుండా, 2013 తర్వాత స్వదేశంలో జింబాబ్వేకు ఇదే తొలి టెస్ట్ గెలుపు. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్‌ను కేవలం 127 పరుగులకే ఆలౌట్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లతో (5/22) సత్తా చాటాడు. జింబాబ్వే తమ మొదటి ఇన్నింగ్స్‌లో 359 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ బెన్ కర్రన్ (121) తన టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేయగా, సికందర్ రజా (65) కీలక పాత్ర పోషించాడు. దీంతో జింబాబ్వేకు 232 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 232 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. పేసర్ రిచర్డ్ ఎన్గరవా 5 వికెట్లు (5/37) తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించాడు. జింబాబ్వే ఒక ఇన్నింగ్స్, 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన అద్భుతమైన శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ కర్రన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు.
