Transport Services: ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగడం, గంటల తరబడి లైనుల్లో నిలబడటం వంటి ఇబ్బందులు వాహన యజమానులు, డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు యజమానులు ఇప్పటివరకు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ వ్యయప్రయాసలకు స్వస్తి చెప్పేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆధార్‌ ధ్రువీకరణ ఆధారంగా 100 రవాణా సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కొత్త గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ దశలవారీగా అమలు చేయాలని సన్నాహాలు చేస్తోంది.

ఖైరతాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ రవాణా శాఖ కార్యాలయ పరిధిలో వారం రోజుల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు, సంబంధిత సేవలను ఆన్‌లైన్‌లో అందించడం దీని లక్ష్యం. తర్వాత ఒక్క నెల లేదా రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని శాఖ యోచిస్తోంది.

పరివాహన్, సారథి, ఈ-చలాన్ పోర్టల్స్ ద్వారా ఆధార్ ధ్రువీకరణతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆధార్ లేని వారు ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలతో సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో సేవలు పొందవచ్చు.

తెలంగాణలో ఇప్పటికే కార్లు, ద్విచక్ర వాహనాల వంటి వ్యక్తిగత (నాన్-ట్రాన్స్‌పోర్ట్) కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు షోరూముల ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఆటోలు, లారీలు వంటి ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు, సేవలు, నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాల సేవలు కూడా ఖైరతాబాద్‌లో త్వరలో అమలులోకి వస్తాయని ఉన్నతాధికారులు తెలిపారు.

ఏయే సేవలు ఆన్‌లైన్‌లో?

కేంద్రం ఈ 100 సేవలను 9 విభాగాలుగా విభజించింది:

డ్రైవింగ్ లైసెన్స్ సేవలు (21 రకాలు): కొత్త లైసెన్స్ జారీ, రెన్యువల్, అడ్రస్/పేరు మార్పు, డూప్లికేట్ లైసెన్స్, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, మొబైల్ నంబర్ మార్పు, స్మార్ట్ కార్డు, లైసెన్స్ సరెండర్ మొదలైనవి.

పబ్లిక్ సర్వీస్ వెహికిల్ బ్యాడ్జ్ (2 సేవలు): ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కొత్త/డూప్లికేట్ బ్యాడ్జ్ జారీ.

కండక్టర్ లైసెన్స్ (6 సేవలు): జారీ, రెన్యువల్, చిరునామా/పేరు మార్పు, డూప్లికేట్, ఎక్స్‌ట్రాక్ట్.

వాహన రిజిస్ట్రేషన్ (39 సేవలు): యాజమాన్య బదిలీ, కొత్త రిజిస్ట్రేషన్, తాత్కాలిక రిజిస్ట్రేషన్, డూప్లికేట్ RC, NOC, అడ్రస్/పేరు మార్పు, హైపోథికేషన్, పన్ను రిఫండ్ మొదలైనవి.

పర్మిట్ సేవలు (17): తాత్కాలిక పర్మిట్, స్టేజ్/కాంట్రాక్ట్ క్యారేజ్, టూరిస్ట్ పర్మిట్, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, నేషనల్ పర్మిట్, పర్మిట్ బదిలీ.

వాహన స్క్రాపింగ్ (3 సేవలు): స్క్రాపింగ్ దరఖాస్తు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్, కొత్త వాహనం కొనుగోలుకు ఉపయోగం.

ఫిట్‌నెస్ సేవలు (6): ఆటోమేటెడ్ టెస్టింగ్ అపాయింట్‌మెంట్, రీషెడ్యూల్, రద్దు, సర్టిఫికెట్, చరిత్ర, చెల్లింపులు.

మల్టీలేన్ ఫ్రీ ఫ్లో (1): బకాయి యూజర్ ఫీజు చెల్లింపు.

ఈ-చలాన్ (5 సేవలు): చలాన్ స్థితి, పెండింగ్ చెల్లింపు, రసీదు, ఫిర్యాదు, స్థితి తెలుసుకోవడం.

PolitEnt Media

PolitEnt Media

Next Story