1,000 Days of Revanth Reddy Government: రేవంత్ సర్కార్ 1000 రోజుల ప్రజాపాలన: సంక్షేమం-అభివృద్ధికి సమప్రాధాన్యం
సంక్షేమం-అభివృద్ధికి సమప్రాధాన్యం

1,000 Days of Revanth Reddy Government: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం సెప్టెంబరు 1న 1,000 రోజుల మైలురాయిని చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం ‘ప్రగతి నివేదిక’ను విడుదల చేసింది. ‘‘1,000 రోజుల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిచ్చాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, రైతులు-మహిళలు-యువతకు భరోసా కల్పించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడం, భవిష్యత్తు తెలంగాణకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేశాం’’ అని ప్రభుత్వం పేర్కొంది.
2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి వలయాలతో హైదరాబాద్ నుంచి గ్రామీణ తెలంగాణ వరకు సమగ్ర అభివృద్ధి దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని నివేదికలో స్పష్టం చేసింది.
ఆర్థిక ప్రగతి.. వ్యవసాయంలో నం.1
2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే దాదాపు 91 శాతం అధికం. రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసి 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు ఊరటనిచ్చాం. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం అందించాం. రైతు సంక్షేమానికి రూ.1.68 లక్షల కోట్లు వ్యయం చేశాం. వరి సాగు, ఉత్పత్తిలో దేశంలో నంబర్-1గా నిలిచింది తెలంగాణ. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నాం.
‘మహాలక్ష్మి’లకు భారీ ఆదా
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలతో మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల ప్రయాణ వ్యయం ఆదా అయింది. గృహజ్యోతి కింద 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 4.54 లక్షల మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల రుణాలు, రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ అందించాం. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నాం. కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. అర్హులకు ఇంటినిర్మాణానికి రూ.5 లక్షల సహాయం ఇస్తున్నాం.
సామాజిక న్యాయంలో చరిత్రాత్మక నిర్ణయాలు
రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి కులాల వారీ సామాజిక స్థితిగతులు వెల్లడించాం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఘనత వహించింది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణతో కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరింది. గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చాం.
విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు
కేంద్రం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి పురోగతి సాధించింది. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 105 మంజూరు చేశాం. 22 లక్షలకుపైగా విద్యార్థులకు అల్పాహారం, పాలు, పోషకాహారం ఇస్తున్నాం. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాం. యువతలో నైపుణ్యం పెంపొందించే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించాం. 65 ప్రభుత్వ ఐటీఐలు, 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. గోషామహల్‌లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాం. 2023 డిసెంబరు 7 నుంచి 2026 ఆగస్టు 12 వరకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా 5,18,186 మందికి రూ.2,526.12 కోట్ల సాయం అందించాం.
కల్తీపై ఉక్కుపాదం.. మౌలిక సదుపాయాలు
ఆహార కల్తీ, డ్రగ్స్ ముప్పును సమగ్రంగా ఎదుర్కొనేందుకు కొత్తగా టీజీ సేఫ్ సంస్థ ఏర్పాటు చేశాం. డ్రగ్స్‌పై ఈగల్ వ్యవస్థ ద్వారా ప్రత్యేక పోరాటం చేస్తున్నాం. భూ భారతి చట్టం, భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు అమలు చేస్తున్నాం. 3.76 లక్షల కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలు జారీ చేశాం. హైదరాబాద్ చుట్టూ దాదాపు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు, రాష్ట్రవ్యాప్తంగా 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల ప్రణాళిక, హైదరాబాద్ మెట్రో రెండో దశలో ఏడు కారిడార్లతో 122.9 కిలోమీటర్ల విస్తరణ, మామునూరు విమానాశ్రయం, ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి, మూసీ పునరుజ్జీవం వంటి ప్రణాళికలు రూపొందించాం. టీజీ-ఐపాస్ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాం. 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లు. 12.14 లక్షల ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమానికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రైతు, యువజన, మహిళా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సంపదను పెంచడమే లక్ష్యంగా ప్రజాపాలన దూసుకెళ్తోందని ప్రభుత్వం ప్రకటించింది.

