109 challans - fines of Rs. 27 thousand

చేతిలో బైక్ ఉంది, ముందర చూస్తే.. రోడ్ ఖాళీ ఉంది.. ఇంకేముంది? రూల్స్‌ గీల్స్‌ జాన్తా నై అనుకుంటున్నాడతను. నిత్యం రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాడు. రాంగ్‌ రూట్లు, హెల్మెట్‌ లేకుండా తిరగడాలు, సిగ్నల్‌ జంపింగ్‌లు ఇలా.. ఎలా పడితే అలా నిబంధనలు ఉల్లంఘించాడు. ఎవరూ చూడటం లేదనుకున్నాడు. ట్రాఫిక్‌ పోలీసులయితే చూడటం లేదు కదా.. బేఫికర్‌ అనుకుంటున్నాడు. కానీ, మూడోనేత్రం అతన్ని వెంటాడుతోంది. ఎక్కడ రూల్స్‌ ఉల్లంఘించినా రికార్డ్‌ చేస్తోంది. చివరకు ఒక చోట ట్రాఫిక్‌ పోలీసులు చిట్టా తీస్తే మనోడి బండారం బయట పడింది.

అదో బైక్‌. ఆ సెకండ్‌ హ్యాండ్ బైక్‌ అమ్మితే రూ.30వేలు వస్తాయేమో.. కానీ, ఆ బైక్‌ను ఆన్‌లైన్‌లో చెక్‌ చేస్తే.. పదుల్లో కాదు.. 109 చలాన్లు ఉన్నాయి. వాటన్నిటినీ లెక్కిస్తే.. రూ.26,310 జరిమానాలు పేరుకుపోయాయి. ఆ చిట్టా చూసి ట్రాఫిక్‌ పోలీసులకే మతి పోయింది. హన్మకొండ చౌరస్తాలో జరిగిందీ సంఘటన.

వరంగల్‌కు చెందిన భిక్షపతి అనే యువకుడు కొన్నాళ్లుగా బైక్‌పై జులాయిగా వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఏమాత్రం బాధ్యత లేకుండా బైక్‌ను నడుపుతున్నాడు. ఈక్రమంలోనే హన్మకొండ అశోక్ జంక్షన్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతారెడ్డి నేతృత్వంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. అప్పుడే భిక్షపతి తన బైక్‌తో అటువైపు వచ్చాడు. ఎరక్కపోయి ఇరుక్కున్నాడు. మొదట పోలీసులు అతన్ని ఆపారు. చలాన్ల చెకింగ్ కోసం మిషన్‌లో అతని బైక్‌ నెంబర్‌ ఎంటర్‌ చేశారు. అయితే, ఒకటో రెండో చలాన్లు వస్తాయని అక్కడున్న వాళ్లు అనుకున్నారు. కానీ, ఆ మిషన్‌లోంచి ప్రింట్లు వస్తూనే ఉన్నాయి. రన్నింగ్‌ ప్రింటర్‌ మాదిరిగా కొద్దిసేపు చలానాలు వస్తూనే ఉన్నాయి. అలా.. రశీదులన్నీ ప్రింటయ్యాక చూస్తే.. అక్కడున్న పోలీసులే విస్తు పోయారు. ఇన్నాళ్లుగా తమకు దొరక్కుండా ఈ స్థాయిలో బైక్‌పై రోడ్లమీద చెలగాట మాడుతున్నాడని తెలుసుకొని సిగ్గుపడ్డారు.

బిక్షపతి బైక్‌కు వచ్చిన చలాన్లలో సిగ్నల్‌ జంప్స్‌, హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ వంటివి ఉన్నాయి. వాటన్నింటికీ కూడా ఆధారాలుగా ఫోటోలు కూడా సీసీ కెమెరాలు రికార్డ్‌ చేశాయి. దీంతో, ఇక.. ఆ బైకను బిక్షపతికి అప్పగిస్తే.. రోడ్లమీద ఎంతమంది ప్రాణాలకు భరోసా ఉండదో అనుకొని.. పోలీసులు బైక్‌ను సీజ్‌ చేశారు. చలాన్లన్నీ కట్టిన తర్వాత బైక్‌ తీసుకెళ్లమని చెప్పగానే బిక్షపతి తన బైక్‌ వదిలి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.


Politent News Web4

Politent News Web4

Next Story