Omkareshwar Temple Development: మంచిరేవులలోని మూసీ నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేసింది. ఆలయ అభివృద్ధి పనులు, ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి కలిపి మొత్తం రూ.1,108.27 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జీఓఆర్‌టీ నం.928 ద్వారా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ సముదాయ అభివృద్ధికి రూ.948.65 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాజగోపురాలు, యాగశాల, పుష్కరిణి తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. అలాగే ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి మరో రూ.159.62 కోట్లు కేటాయించారు. ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు సుమారు 2.50 కిలోమీటర్ల పొడవున 30 మీటర్లు (100 అడుగులు) వెడల్పుతో ఆరు లేన్ల రోడ్డు నిర్మించనున్నారు. ఈ రహదారి గ్రేహౌండ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలకు అనుసంధానం కానుంది. మూసీ రివర్‌ఫ్రంట్ రోడ్ నెట్‌వర్క్‌తో ఆలయ సముదాయానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.

మరో కీలక నిర్ణయంగా ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓఆర్‌టీ నం.929ను జారీ చేసింది. రూ.700 కోట్ల ఆలయ ప్రాజెక్ట్‌కు ఈ కమిటీ సాంకేతిక మార్గదర్శకత్వం అందించనుంది. డిజైన్లు, డీపీఆర్‌లు, రేట్లు, టెండర్లపై కమిటీకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆర్‌ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ కమిటీ చైర్మన్‌గా, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కో-చైర్మన్‌గా, ఎంఆర్‌డీసీఎల్ చీఫ్ ఇంజినీర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఎండోమెంట్స్ చీఫ్ ఇంజినీర్, ఆలయ ఆర్కిటెక్చర్ నిపుణుడు డా.ఈ.శివనాగిరెడ్డి, ఫైనాన్స్ శాఖ అదనపు కార్యదర్శి కమిటీ సభ్యులుగా ఉండనున్నారు.

మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌కు కొత్త రూపురేఖలు తీసుకురాగలదని అధికార వర్గాలు తెలిపాయి.

Next Story