రెండు కీలక రోడ్డు ప్రాజెక్టులతో సికిందరాబాద్ ట్రాఫిక్‌కు భారీ ఉపశమనం

₹150-Crore Y-Shaped Elevated Flyover in Rasoolpura: హైదరాబాద్‌లోని బేగంపేట్ - సర్దార్ పటేల్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి రసూల్‌పురా జంక్షన్ వరకు ఎప్పుడూ భారీ ట్రాఫిక్ ఇరుకున పడుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) రెండు మెగా రోడ్డు ప్రాజెక్టులను చేపట్టనుంది. ఇవి పూర్తయితే ప్రకాష్‌నగర్, రసూల్‌పురా, పాటిగడ్డ, మినిస్టర్ రోడ్డు, పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్లే వాహనదారులకు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన ఇక్కట్లు తప్పనున్నాయి.

మొదటి ప్రాజెక్టు - రూ.150 కోట్లతో రసూల్‌పురా దగ్గర Y-ఆకారపు ఫ్లైఓవర్: హెచ్‌ఎంఆర్‌ఎల్ (మెట్రో రైల్ ఆఫీస్) భవనం పక్కన నుంచి మొదలయ్యే ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ సుమారు 850 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది రెండు శాఖలుగా విడిపోయి - ఒకటి మూడు లేన్లతో మినిస్టర్ రోడ్డు వైపు, మరొకటి రెండు లేన్లతో పాటిగడ్డ వైపు వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ ఒకే దిశలో (యూనిడైరెక్షనల్) వాహనాలు వెళ్లేలా రూపొందించారు. దీంతో పంజాగుట్ట నుంచి నేరుగా రసూల్‌పురా వైపు వెళ్లే వాహనాలు సిగ్నల్స్ లేకుండా స్పీడ్ పరుగు పెట్టనున్నాయి.

రెండో ప్రాజెక్టు - రూ.108.02 కోట్లతో పాటిగడ్డ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (RoB): పైగా ప్యాలెస్ నుంచి పీవీ నరసింహారావు మార్గం వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగనుంది. ఇది జేమ్స్ స్ట్రీట్, మినిస్టర్ రోడ్డు, రసూల్‌పురా మధ్య ట్రాఫిక్‌ను సునాయాసంగా మళ్లిస్తుంది. అదనంగా పాటిగడ్డ రోడ్డును 100 అడుగుల వెడల్పుకు విస్తరించనున్నారు. దీంతో ఆర్‌బీఐ క్వార్టర్స్ నుంచి సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్ దాటి పీవీ మార్గం వైపు వెళ్లే రోడ్డు సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

ఈ రెండు ప్రాజెక్టులు బేగంపేట, ప్రకాష్‌నగర్, వల్లభ్‌నగర్, ఎయిర్‌లైన్స్ కాలనీ, పాటిగడ్డ, సర్దార్ పటేల్ రోడ్డు, వికార్‌నగర్ ప్రాంత ప్రజలకు డబుల్ బోనాంజాగా మారనున్నాయి. గత దశాబ్దంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందడంతో ట్రాఫిక్ భారీగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్-సిటీఐ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కింద జీహెచ్‌ఎంసీ ఈ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. స్థానికులు ఈ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ.. చిరకాల కోరిక నెరవేరినట్టు సంబరపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story