Indiramma Family Life Insurance Scheme: పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత భరోసా.. సిద్దిపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

Indiramma Family Life Insurance Scheme: రాష్ట్రంలోని పేద, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం (నవంబర్ 19) సాయంత్రం సిద్దిపేటలో అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కుటుంబంలో సంపాదించే సభ్యుడు అనుకోని మరణం చెందినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ పథకం రూపొందించబడింది.
సిద్దిపేట ఇందిరా చౌరస్తా నుంచి సభా ప్రాంగణమైన నాగదేవత కూడలి వరకు 2.2 కిలోమీటర్ల మేర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్ర చేయనున్నారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పథకాన్ని ప్రారంభించనున్నారు. స్వశక్తి సంఘాల మహిళలు, ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.
ఈ పర్యటనలో సిద్దిపేట జిల్లా అభివృద్ధికి సంబంధించిన మొత్తం రూ.544.11 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో రూ.451.13 కోట్ల పనులకు శంకుస్థాపనలు, మిగిలిన రూ.92.98 కోట్లతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు ఉన్నాయి.
దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో రూ.200 కోట్ల చొప్పున వెచ్చించి నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు, మరో ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, రూ.13.50 కోట్లతో ఆరు తహసీల్దార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.
చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, జనగామ నియోజకవర్గంలో రూ.6.89 కోట్లతో నిర్మించనున్న మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలను కూడా ప్రారంభిస్తారు.
సిద్దిపేట జిల్లాలో రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లను, కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రాన్ని, రూ.12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలు, రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం, గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయానికి కూడా ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గమైన సిద్దిపేటలో ఈ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను సంస్థాగతంగా పటిష్ఠం చేయాలని సీఎం గట్టి పట్టుదలతో ఉన్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జనగామ, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్దయెత్తున జనసమీకరణ జరుగుతోంది.
మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల అధికారులు కూడా స్వశక్తి మహిళలు, లబ్ధిదారులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ పథకంతో రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు భరోసా లభించనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

