True-Up Charges: రూ.5,420 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు.. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులపై ప్రభావం
ప్రభావం

True-Up Charges: రాష్ట్రంలోని వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేయడానికి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) సోమవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు డిస్కంలకు ఉత్తర్వులు జారీ చేసింది.
2022-23లో విద్యుత్ కొనుగోలుకు అదనంగా ఖర్చు చేసిన రూ.5,186.29 కోట్లు, 2023-24 రెవెన్యూ లోటు రూ.2,448.93 కోట్లు కలిపి మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు ఉన్నాయి. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఈఆర్‌సీ స్పష్టం చేసింది. మిగిలిన మొత్తాన్ని వ్యవసాయేతర కనెక్షన్ల వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.
వచ్చే నెల (నవంబర్) నుంచి జారీ అయ్యే కరెంటు బిల్లుల్లోనే ఈ ఛార్జీలు వసూలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ బిల్లులో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసల చొప్పున వసూలు చేయాలని డిస్కంలను ఆదేశించారు. దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 26 నెలల పాటు ఈ ఛార్జీలు వసూలు కానున్నాయి. 2022-23, 2023-24లలో వాడిన యూనిట్ల ఆధారంగా ఈ ఛార్జీ లెక్కిస్తారు.
ఉచిత విద్యుత్ పథకం అమల్లో ఉన్నందున వ్యవసాయ కనెక్షన్లపై నేరుగా ట్రూ-అప్ ఛార్జీ విధించరు. ప్రతి నెలా జారీయ్యే బిల్లులో ట్రూ-అప్ ఛార్జీని ప్రత్యేకంగా చూపాలని, ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది, వినియోగ పరిమాణం, యూనిట్ రేటు వంటి వివరాలు స్పష్టంగా పేర్కొనాలని కమిషన్ ఆదేశించింది. ఇతర ఛార్జీలతో కలపకూడదని కూడా స్పష్టం చేసింది.
ట్రూ-అప్ అంటే ఏమిటి?
ప్రతి ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఎంత విద్యుత్ కొనుగోలు చేయాలి, ఎంత రెవెన్యూ వస్తుందనే అంచనాలను ఈఆర్‌సీ ఆమోదిస్తుంది. అంచనాల కంటే ఎక్కువ ఖర్చు జరిగినా లేదా రెవెన్యూ తక్కువగా వచ్చినా ఆ లోటును పూడ్చుకోవడానికి వసూలు చేసే ఛార్జీలనే ట్రూ-అప్ అంటారు.

