గతంలో ఎన్నడూ జరగని మహావిషాదం – రేవంత్ రెడ్డి
పాశమైలారంలోని కెమికల్ ఫ్యాక్టరీని సందర్శిచింన సీయం

పాశమైలారంలో జరిగిన కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ పేలిన ఘటన అత్యంత విషాదకరమైన దుర్ఘటన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదని సీయం అన్నారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదం జరిగిన కెమికల్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఇప్పటి వరకూ 36 మంది మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కంపెనీలో మొత్తం 143 మంది ఉన్నారని ఇప్పటి వరకూ 58 మందిని అధికారులు గుర్తించారని, మిగలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీయం తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించినట్లు సీయం చెప్పారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి ఐదు లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని సీయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీయం తెలిపారు. ఈ దుర్ఘటనకు బాద్యులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఇటువంటి ఘటనలు జరగకుండా కంపెనీల్లో పీరియాడికల్ ఇన్స్‌స్పెక్షన్ చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
