తెలంగాణ రాష్ట్రంలో గో సంరక్షణకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గోవుల రక్షణ, సంక్షేమం అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో పశుసంవర్థక శాఖ, దేవాదాయ శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో గోవుల రక్షణకు తీసుకోవాల్సిన సమగ్ర చర్యలపై చర్చ జరిగింది.



సంస్కృతిలో గోవులకు ఉన్న విశిష్ట స్థానం, భక్తుల మనోభావాలు, ఆలయాలకు చేసే గోవుల దానం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంత ఖర్చైనా వెనకాడబోమని ఆయన తేల్చిచెప్పారు.



ఈ దిశలో భాగంగా మొదటి అడుగుగా ప్రభుత్వం నాలుగు కీలక ప్రాంతాల్లో ఆధునిక గోశాలల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. వీటిలో వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ శివార్లలోని ఎనికేపల్లి, అలాగే పశుసంవర్థక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన గోశాలలు నిర్మించనున్నారు. విశాలమైన స్థలాల్లో ఆధునిక వసతులతో ఈ గోశాలలు నిర్మించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. వేములవాడలో అయితే ప్రత్యేకంగా వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశాలిచ్చారు.



అలాగే, గోవుల రక్షణకు సమగ్ర విధానం రూపొందించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న గో సంరక్షణ విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయదగిన సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించనుంది.



ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేవాలయాల్లో భక్తులు గోవులను దానం చేస్తూనే ఉన్నారని, అయితే గోశాలలకు అవసరమైన స్థాయిలో స్థలాల కొరత, నిర్వహణ సక్రమంగా లేకపోవడం వంటి కారణాతో చాలా గోవులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను వెంటనే అధిగమించాలని, ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.




Politent News Web4

Politent News Web4

Next Story