A. Revanth Reddy: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో భాగంగా జరుగుతున్న అన్ని పరీక్షలను ఒకటికి రెండుసార్లు ధృవీకరించుకొని మాత్రమే ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు, పరీక్ష ఏజెన్సీలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. బ్యారేజీ పునరుద్ధరణ పనుల పురోగతిని సోమవారం మేడిగడ్డలో సీఎం స్వయంగా పరిశీలించి, అధికారులతో వివరంగా సమీక్షించారు.

బ్యారేజీలో కుంగిన ఏడవ బ్లాక్‌లోని పియర్స్‌ 20, 21, 22 వద్ద రిగ్గుల ద్వారా బోర్‌హోల్ డేటా సేకరణ, జియోటెక్నికల్, జియోఫిజికల్, జీపీఆర్ పరీక్షల కోసం తీసిన నమూనాలను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పుణెలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సంస్థకు ఈ నమూనాలు పంపించి ల్యాబ్‌లో విశ్లేషించిన తర్వాత బ్యారేజీ డ్యామేజీపై స్పష్టమైన చిత్రం వచ్చే సమాచారం ఇచ్చారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఛైర్మన్ అనిల్ జైన్, ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త సత్యనారాయణ, స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పరీక్షిత్ మెహ్రా, ఈఎన్‌సీ రమేశ్‌బాబు తదితరులు.

డ్రోన్ ఆధారిత జీపీఆర్ పరీక్ష ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు పియర్స్‌ల వద్ద నేల స్వభావం తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు. సీకెంట్ ఫైల్స్‌కు సంబంధించిన సమాంతర క్రాస్‌హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి తెలుసుకున్నారు. ప్రతి పరీక్షా కచ్చితంగా ఉండాలని, ఏ దశలోనైనా రెండుసార్లు నిర్ధారణ చేసుకోవాలని ఆయన ఆదేశించారు.

సమీక్షలో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి “మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని లోపాలపై స్పష్టత వచ్చింది. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారం. సేకరించిన నమూనాల ఫలితాల ఆధారంగా మాత్రమే పనులు చేపట్టాలి. ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని దశల్లోనూ వారి ఆమోదం తప్పనిసరి” అని సూచించారు.

ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సులు, ఇప్పటివరకు పూర్తి చేసిన పరీక్షలు, మిగిలిన పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరించారు. ప్రతి పరీక్ష పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రిగ్గులు బ్యారేజీల వద్దకు తరలించారు అనే వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరుకు 100 రిగ్గులు పని చేస్తాయని, మేడిగడ్డ బ్యారేజీ జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు మే ఆఖరుకు పూర్తవుతాయని, జూన్ 15 నాటికి సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. వెంటనే డిజైన్ పనులు ప్రారంభించి అక్టోబరు ఆఖరుకు పూర్తి చేస్తామన్నారు. హైడ్రాలిక్ 2డి మోడల్ స్టడీస్ నవంబరు 15 వరకు, నవంబరు ఆఖరు నాటికి డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం లభిస్తుందని స్పష్టం చేశారు.

సీకెంట్ ఫైల్స్ దెబ్బతిన్నాయని, వాటిని మార్చాల్సి ఉంటుందని డిజైనర్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి తెలియజేయగా, “పరీక్షలు పూర్తి చేయకుండా ఎలా నిర్ధారణకు వచ్చారు? సగం సగం చేయవద్దు” అని సీఎం హెచ్చరించారు. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలో ఏడవ బ్లాక్ పియర్స్‌లో ఏర్పడిన భారీ పగుళ్లు, తర్వాత జరిగిన పరిణామాలను అధికారులు వివరించారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ “పనులు మరింత వేగంగా జరగాలంటే అవసరమైన చర్యలు తీసుకోవాలి. నిర్మాణ సంస్థలు పూర్తిగా సహకరించాలి. ఒప్పందంలో లేని పనులు చేయాల్సి వస్తే ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుంది. కానీ పరీక్షల్లో లోపాలు గుర్తిస్తే అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము” అని స్పష్టం చేశారు. పరీక్షల వేగం మరింత పెంచాలని ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్ అనిల్ జైన్ కూడా సూచించారు.

ఈ పరిశీలన, సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇంజినీర్లు, మూడు బ్యారేజీల నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసగుప్తా, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, కన్సల్టెంట్ యాదగిరి తదితరులు కీలక అంశాలను సీఎం దృష్టికి తెచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story