అసెంబ్లీ వాయిదా వేయకుండా, మైక్‌ కట్‌ చేయకుండా ఉంటే చర్చకు మేము సిద్దం

మేడిగడ్డ, సుందిళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ అప్రూవల్ వివరాలను, మూడు సార్లు అసెంబ్లీ ఆమోదం, చర్చ వివరాలను పీసీఘోష్‌ కమిషన్ కు డాక్యుమెంట్లతో సహా అందించామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు తెలిపారు. శుక్రవారం బీఆర్‌కే భవన్‌ లో పీసీఘోష్‌ కమిటీకి అదనపు సమాచారం సమర్పించిన అనంతరం హరీష్‌ రావు మీడియాతో మాట్లాడారు. కమిషన్‌ నిన్న గురువారం సమయం ఇచ్చారని అయితే మా నాయకుడు కేసీఆర్‌ కు వైద్య పరీక్షలు ఉన్నందున రాలేకపోతున్నానని శుక్రవారం వస్తానని కమిషన్‌ ని రిక్వెస్ట్‌ చేయగా అంగీకరించారని తెలిపారు. వారిచ్చిన సమయం ప్రకారం ఈ రోజు కమిషన్ను కలసి మా దగ్గర ఉన్న అదనపు సమాచారం అందించామని తెలిపారు. ఆ రోజుల్లో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలు, క్యాబినెట్ నోట్ వంటి సమాచారం కావాలని లేఖల రూపంలో చీఫ్ సెక్రెటరీ, జీఏడీ సెక్రెటరీ, ఇరిగేషన్ సెక్రెట్రరీలను అడిగామని కాని వారి నుంచి స్పందన రావడం లేదని కమిషన్‌ కి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కమిషన్‌ కు ఇచ్చిన వివరాలు మాకు ఇవ్వమంటే ప్రభుత్వం ఇవ్వడం లేదని కమిషన్ను తప్పు దారి పట్టించేలా ప్రభుత్వం వివరాలు అందిస్తోందనే అనుమానం మాకు ఉందన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, 50 ఏండ్ల కాంగ్రెస్ ద్రోహ చరిత్రకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని హారీష్‌ రావు ఆరోపించారు.

రాష్ట్రం ఏర్పడిన 42వ రోజునే ఢిల్లీలో సెక్షన్ 3 కింద నీళ్ళు పంపిణీ చేయండి, 299 ఇచ్చి అన్యాయం చేసారు, 68శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటా ఇవ్వాలని కేసీఆర్ గారు అడిగారని తెలిపారు. సెక్షన్ 3 కోసం కేసీఆర్ గారు ఉమా భారతి గారిని కలిసారు, గడ్కరి, షకావత్ , ప్రధానిని కలిసారని చెప్పారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించింది కేసీఆర్ అని పేర్కొన్నారు. నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తది, ఆ ట్రిబ్యునల్ సాధించింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు. ఇదే రేవంత్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయ్యింది. 299 టీఎంసీలు చాలని 2025లో ఉత్తం, రేవంత్ సంతకాలు పెట్టుకొని వచ్చారని హరీష్‌ రావు విమర్శించారు. గోదావరిలో 1000, కృష్ణలో 500 ఇచ్చి ఎన్ని నీళ్లన్నా తీసుకుపో అని చంద్రబాబుకు రేవంత్ ఆఫర్ ఇచ్చారని హరీష్‌ రావు ఆరోపించారు. గోదావరిలో మన వాటా 1000 కాదు, 2918 కావాలని కేసీఆర్ అడిగారని ఇదే విషయం బయట పెడితే నాలుక కరుచుకున్నరన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సైతం మన నీటి హక్కుల గురించి తెలవక పోవడం బాధాకరమని హరీష్‌ రావు అన్నారు. రేవంత్ రెడ్డి పుట్టక ముందు ముత్తాత పుట్టక ముందు ఉన్న ఆయకట్టును కూడా కాంగ్రెస్ లో కలుపుతున్నారని హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. మా హయాంలో నీటిపారుదల ప్రాజెక్టులపై అన్ని ఆధారాలు ఉన్నాయి, దమ్ముంటే నీకు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టు, ఒక్కటే షరతు, మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోవద్దు ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైన చర్చిద్దామని హరీష్‌ రావు సవాల్‌ విసిరారు..

Politent News Web 1

Politent News Web 1

Next Story