DGP CV Anand: సైబర్‌ నేరాల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, బాధితులకు తక్షణ సేవలు అందించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికతను విస్తృతంగా అమలు చేయాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐ ఆధారిత కాల్‌సెంటర్‌ను డీజీపీ పరిశీలించారు. బాధితులు ఫోన్‌ చేసి సైబర్‌ మోసాల గురించి ఫిర్యాదు చేస్తే, ఏఐ వ్యవస్థ స్వయంచాలకంగా స్పందించి వివరాలను సేకరించి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు చేరవేసే విధానాన్ని ఆయన పర్యవేక్షించారు.

డీజీపీ మాట్లాడుతూ, రాష్ట్రంలో సైబర్‌ నేరాల వల్ల బాధితులు కోల్పోయిన ఆర్థిక నష్టం గతేడాది 2024తో పోల్చితే 20 శాతం తగ్గడం, ఫిర్యాదుల సంఖ్య 3 శాతం తగ్గడం నేర నియంత్రణలో సానుకూల సూచన అని అన్నారు. సమావేశంలో బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయెల్, ఎస్పీలు హర్షవర్ధన్, సాయిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

సేఫ్‌ సిటీ ప్రాజెక్టుతో పౌరుల భద్రత మెరుగు

అదే సమయంలో సేఫ్‌ సిటీ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పౌరుల భద్రతను మరింత బలోపేతం చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. ప్రాజెక్టు అమలు విషయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.

అత్యాధునిక సీసీ కెమెరాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వ్యవస్థలను సమర్థంగా వినియోగించి నేరాల నివారణ చర్యలను విస్తృతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీజీలు మహేశ్‌భగవత్, చారుసిన్హా, పోలీస్‌ కమిషనర్లు వీసీ సజ్జనార్, రమేశ్‌రెడ్డి, సుమతి, తరుణ్‌జోషి తదితరులు పాల్గొన్నారు.

ఈ చర్యలు సైబర్‌ నేరాలు మాత్రమే కాకుండా సాధారణ నేరాల నియంత్రణలో కూడా గణనీయమైన మార్పు తీసుకువస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story