AI Revolution in Politics: కృత్రిమ మేధ (ఏఐ)తో భవిష్యత్తులో రాజకీయాలు మారిపోతాయని, ఎన్నికల్లో ఏఐ మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు తెలిపారు. ఎన్నికల్లో ఎవరికి ఎందుకు ఓటు వేయాలన్న విషయానికి ఏఐపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దైనందిన జీవితంలో ఏఐ ప్రజలకు ఒక సహాయకారిగా మారుతుందని, ఆ సాధనాలను సురక్షితంగా ఉపయోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమిట్‌లో భాగంగా శుక్రవారం ‘‘ఏఐ, క్లౌడ్ కేపిటలిజం, కొత్త ప్రపంచక్రమం’’పై చర్చ జరిగింది.

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సరైన నియంత్రణ విధానాలను తీసుకువచ్చి, సాంకేతికత దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. డిజిటల్ యుగంలో డేటా ఏఐకు అసలైన ఇంధనమని, దాన్ని పరిరక్షించుకుంటూ సాంకేతిక అభివృద్ధి సాధించాలని చెప్పారు. తెలంగాణ యువతకు ఏఐ నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రిహ్లా కన్సల్టెంట్ సీఈవో జెస్సీ మార్క్స్ కొత్త తరానికి చెందిన ప్రజలు ఏఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, ప్రజల వ్యక్తిగత గోప్యత చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ చర్చకు సుప్రియా శ్రీనేత్ సంధానకర్తగా వ్యవహరించారు.

ప్రస్తుతం వినియోగిస్తున్న ఏఐ నమూనాలు ప్రజల వనరుల్ని దోపిడీ చేసేలా ఉన్నాయని ఫ్రాన్సెస్‌కో లాపెంటా, డైరెక్టర్ ఐఎఫ్‌ఐఎస్ అన్నారు. ఒకసారి వాటికి ఇన్‌పుట్ ఇస్తే వెనక్కు తీసుకోలేమని చెప్పారు. యూరప్‌లో వ్యక్తిగత, వ్యక్తిగతేతర డేటా మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని తెలిపారు. ఏఐ మానవ మెదడు లాంటిది కాదని, కేవలం గణితం, సంభావ్యతల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే టూల్ అని పేర్కొన్నారు.

యూరప్‌లో ప్రభుత్వాల నిర్ణయాలు కార్పొరేట్ ప్రయోజనాల ఆధారంగా ఉంటున్నాయని మోంటీ అల్, డిజిటల్ విధానాల ఎనలిస్టు అన్నారు. సమాజంలో సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ నిబంధనలు ముందుగానే నిర్దేశించాలని సూచించారు. కొంతమంది కార్పొరేట్ల చేతుల్లో సాంకేతికత వదిలివేయొద్దని హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో దాదాపు 20 శాతం మంది ప్రజలు ఎవరికి ఓటు వేయాలన్న విషయాన్ని ఏఐని అడిగి పోల్చుకుంటున్నారని ఫ్రెడెరిక్ జైన్స్కీ, ఫ్రాన్స్ మాజీ ఎంపీ అన్నారు.

భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలతోపాటు ఫ్రాన్స్‌లో 2026లో జరిగే స్థానిక, 2027 జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. ఏఐ ఆధారిత వీడియోలు, డీప్‌ఫేక్‌తో తప్పుడు ప్రచారం పెరిగిందని, దీన్ని అడ్డుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణలు తీసుకురావాల్సిన అవసరముందని సూచించారు. ఏఐ వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ, సురక్షితంగా ఉపయోగించాలని నిపుణులు ఒకేసారి హెచ్చరించారు. తెలంగాణ యువతకు ఏఐ నైపుణ్యాలు అందించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది.

Next Story