Chief Secretary Sanjay Jaju: రాష్ట్రంలో పారదర్శక, వేగవంతమైన, సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు, ఉత్తర్వులను డిజిటల్‌ విధానంలో జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో గురువారం ఈ-హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌) అమలు, ప్రభుత్వ శాఖల్లో డిజిటల్‌ విధానాలపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో సుమారు 3.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో పూర్తి స్థాయిలో డిజిటలైజ్‌ చేయాలని సీఎస్‌ సూచించారు. మొత్తం 38,710 కార్యాలయాలకు సంబంధించిన డేటాలో ఇప్పటికే సుమారు 93 శాతం పూర్తయినట్లు అధికారులు వివరించారు. మిగిలిన ప్రక్రియను అక్టోబరు 15 నాటికి పూర్తి చేయాలని సీఎస్‌ ఆదేశించారు.

పాలనలో పారదర్శకత, వేగం, సామర్థ్యాన్ని పెంచేందుకు భవిష్యత్తులో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వులను సాధ్యమైనంత వరకు డిజిటల్‌ విధానంలో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంజయ్‌ జాజు అన్నారు. ఆర్థిక శాఖకు సంబంధించిన ఈ-శాంక్షన్‌ ఉత్తర్వులను పూర్తిగా డిజిటల్‌ విధానంలోకి తీసుకురావాలని, అన్ని ఆర్థిక సేవలు, మంజూరులు, చెల్లింపుల ప్రక్రియలను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా వ్యవస్థలను సమన్వయం చేయాలని సూచించారు.

ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించిన సాంకేతిక అనుమతుల ప్రక్రియను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ నుంచి చీఫ్‌ ఇంజినీర్‌ వరకు సాంకేతిక అనుమతులను డిజిటల్‌ విధానంలో చేపట్టాలని ఆదేశించారు. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) మంజూరులను ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణతో పారదర్శకంగా నిర్వహించాలని, ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌తో పాటు అన్ని డిజిటల్‌ విధానాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రతి శాఖలో నోడల్‌ అధికారిని నియమించాలని కూడా సీఎస్‌ పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మరింత ఊతమిచ్చేలా డిజిటల్‌ విధానాలను సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story