Minister Damodar Rajanarasimha: వైద్య సేవలన్నీ జిల్లా స్థాయిలోనే అందాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
మంత్రి దామోదర్ రాజనర్సింహ

Minister Damodar Rajanarasimha: ప్రజలకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు జిల్లా స్థాయిలోనే అందుబాటులో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు ఈ లక్ష్య సాధనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
సోమవారం సచివాలయంలో ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్’ (డీఎస్‌హెచ్) పునర్‌వ్యవస్థీకరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కి) రూపొందించిన అధ్యయన నివేదికలోని ప్రతిపాదనలను పరిశీలించారు.
‘‘డీఎస్‌హెచ్ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు, అవసరమైన వైద్య సిబ్బంది, డయాగ్నొస్టిక్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రోగులు చిన్నచిన్న సమస్యలకు హైదరాబాద్‌కు, బోధనాసుపత్రులకు వెళ్లే పరిస్థితి తగ్గుతుంది’’ అని మంత్రి అన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, అస్కి డైరెక్టర్ సుబోధ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

